తెలంగాణలో బీజేపీ వ్యూహం అదేనా..? – Komati Reddy VS Alleti Maheshwar Reddy

By KTV Telugu On 1 April, 2024
image

KTV TELUGU :-

సామ దాన భేద దండోపాయాలతో అధికారాన్ని  హస్తగతం చేసుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోందని అనేక రాష్ట్రాల్లో నిరూపితమవుతుంది. ఆయా  రాష్ట్రాల్లో సొంతంగా అధికారం చేపట్టే వరకు ఇలాంటి వ్యూహాలను కొనసాగిస్తూ ఉండటమే ఆ  పార్టీ తన కర్తవ్యంగా భావిస్తోంది. తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే ఇక రెచ్చిపో అని ఏలేటి మహేశ్వర్  రెడ్డికి సందేశమిచ్చినట్లు  భావించాలి. ఆయనది బీజేపీలోకి లేట్ ఎంట్రీ అయినప్పటికీ  పార్టీ తీరు తెలుసుకాబట్టి.. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు. మేము తలచుకుంటే మీరు ఎంత అని సవాలు చేస్తున్నారు…

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గొడవలు కాసేపు పక్కకు వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఎవరెవరు వస్తున్నారన్న లెక్కలు కాసేపు ఫ్రీజ్ అయిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త గేమ్ కు తెరలేచినట్లుగా అనుమానాలకు తావిస్తూ కాంగ్రెస్సా, బీజేపీనా ఎవరు గ్రేట్ అన్న టాక్ కు ఘనంగా తెరలేచింది. పైగా కొందరు నేతలు మాట్లాడిన మాటలు  భవిష్యత్ రాజకీయాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపెట్టే ప్రయత్నం చేశాయి. నిజానికి కోమటిరెడ్డి బీఆర్ఎస్ వరకు లెక్కలు చెబితే బావుండేది. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించి ఓ  తేనెతుట్టెను  కదిలించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ మారే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ మొదలైంది. బీజేపీ మొత్తం కాంగ్రెస్‌లో మెర్జ్‌ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై బీజేఎల్పీ నేత మహేశ‍్వర్‌రెడ్డి స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి భార్యకే ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.అంతటితో ఆగకుండా తెలంగాణలో  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో షిండే అవుతారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ముందు ఒప్పుకున్నారని తెలిపారు. కానీ, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డిని నమ్మడం లేదని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయొద్దన్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌లోని 60 మందిని 48 గంటల్లో లాగేస్తామని హెచ్చరించారు. ప్రజా తీర్పును గౌరవించి తాము పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ మాటలకు కోమటిరెడ్డి గట్టిగానే రిటార్చిచ్చారు. మహేశ్వర్ రెడ్డే మంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో బేరం మాట్లాడారని ఆయన అన్నారు. కావాలంటే భాగ్యలక్ష్మి  ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ సవాలు విసిరారు…

రెండు  పార్టీలు పత్తిత్తులేమీ  కాదు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఎమ్మెల్యేలను లాక్కోవడంలో రెండు పార్టీలు సిద్ధహస్తులే. కాకపోతే మహేశ్వర్ రెడ్డి ఆవేశంగా మాట్లాడలేదని అందులో ఏదో మతలబు ఉందని చర్చ జరుగుతోంది. కేవలం ఎనిమిది ఎమ్మెల్యేలున్న పార్టీ ఎలా ఇతరులను లాగుతుందన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి…

మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా,హిమాచల్ ప్రదేశ్  ఎక్కడైనా ఎమ్మెల్యేలను లాక్కునే టెక్నిక్  బీజేపీకి బాగానే తెలుసు. తొలుత మభ్యపెట్టి, తర్వాత బెదిరించి కూడా లాగేసుకుంటారు. ఢిల్లీలో ఒక్క చోట వారి పాచిక పారలేదు . దానితో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎలా జైలుకు పంపారో కళ్లెదుటే కనిపిస్తున్న నిజం. కేజ్రీవాల్ ను దించేసేందుకు అంగీకరిస్తే కేసు పెట్టబోమని బీజేపీ నేతలు చెప్పినట్లుగా సిసోడియా స్వయంగా వెల్లడించారు. వాళ్ల దారికి వస్తే మాత్రం  సాయం చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్  ప్రకటిస్తే.. వారందరికీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చింది. తెలంగాణలో కూడా అలాంటి ఆపరేషన్ చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నినట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ తమకు కంచుకోట కావాలని బీజేపీ చాలా రోజులుగా లెక్కలేసుకుంటున్న తరుణంలో ప్లాన్ అమలుచేయబోతున్నారని కూడా తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఉండే గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కష్టమేమీ కాదని బీజేపీ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది. కాంగ్రెస్  లోకి ఇబ్బడిముబ్బడిగా బీఆర్ఎస్ నేతలు చేరిపోతున్న  తరుణంలో ముందే  అక్కడున్న వారికి ఉక్కపోత పెరిగే ఛాన్సుంది. అలాంటి వారు పక్క చూపులు చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసేందుకు బీజేపీ రెడీగా ఉంటుంది. పైగా ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో రాణించిన వారు కావడంతో వారిపై ఉన్న ఐటీ, ఇతర కేసులను తిరగతోడటం కష్టమేమీ కాదు. కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం కూడా కష్టమేమీ కాదన్న  విశ్వాసం బీజేపీలో ఉంటుంది. ఒక్క సారి ఈడీని ఇంటికి  పంపితే ఎంతటివారైనా దిగివస్తారని మోదీ  మహాశయుడికి తెలియనిది కాదు. నిజానికి మహేశ్వర్ రెడ్డి పరోక్షంగా చెప్పిన వాస్తవం కూడా అదే. మేము తలచుకుంటే 48 గంటల్లో లాగేస్తామన్న ఆయన హెచ్చరికలో  చాలా పెద్ద సందేశమే ఉంది…

మేము తలచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి  టచ్ లోకి వస్తారని  ఈటల రాజేందర్ ధైర్యంగా ప్రకటించారంటే తమ పార్టీ  సమర్థతపై ఆయనకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్  పార్టీలో సీఎంగా రేవంత్  రెడ్డి శాశ్వతం కాదన్న టాక్ వారిలోనే  మొదలైన తరుణంలోనే బీజేపీ తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల వరకు మాటల మంటలు పుట్టించి తర్వాత అసలు ఆపరేషన్ కు తెరతీస్తారని ఢిల్లీ  వర్గాల్లో టాక్.  పైగా బీజేపీలోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారిపై బీజేపీకి గొంతుదాకా కోపముంది. అందుకే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నదీ ఒక్కటే. బీజేపీ వారి ఆపరేషన్ ఆకర్ష్ అమలు తీరు ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి