తెలంగాణ కాంగ్రెస్‌కి మంచిరోజులొస్తాయా?

By KTV Telugu On 21 January, 2023
image

మహేష్‌కుమార్‌గౌడ్‌ అరవొచ్చు. వీహెచ్‌ విసవిసా వెళ్లిపోవచ్చు. కానీ హైదరాబాద్‌ గాంధీభవన్‌ మాత్రం చాలారోజుల తర్వాత మళ్లీ కళకళలాడింది. అన్నిటికంటే హైలైట్‌ ఏంటంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఆఫీస్‌ గుమ్మతొక్కడం. తమ్ముడు కాంగ్రెస్‌నివీడి బీజేపీలో చేరినప్పటినుంచీ కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లే ఉన్నారు కోమటిరెడ్డి. ఓ దశలో ఆయన కూడా పార్టీనుంచి వెళ్లిపోతారనుకున్నారు. ఆ మధ్య మోడీని కలవటంతో కాంగ్రెస్‌తో కోమటిరెడ్డి అనుబంధం ఇక తెగిపోయినట్లేనని భావించారు. కానీ కోమటిరెడ్డి మళ్లీ గాంధీభవన్‌లో ప్రత్యక్షమయ్యారు.

సీనియర్లంతా వ్యతిరేకించిన మాణిక్కంఠాగూర్‌ తప్పుకున్నారు. ఆయన స్థానంలో మాణిక్‌రావ్‌ థాక్రే కొత్త ఇంచార్జిగా వచ్చారు. ఆయన రాక సందర్భంగా మళ్లీ గాంధీభవన్‌లో నేతలంతా కనిపించారు. రుసరుసలాడుతున్నవాళ్లు, మొన్నటిదాకా మొహాలు చాటేసినవాళ్లూ అంతా ఓ చోట కలిసి కూర్చున్నారు. ముందురోజే ఇంచార్జితో మంతనాలు జరిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కూడా కలుసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచే పరిణామం. రేవంత్‌మీద నిప్పులు చెరుగుతున్న కోమటిరెడ్డి ఆయనతో భేటీ కావటంతో పాటు చేతులు కలపటంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచిరోజులొస్తాయని కార్యకర్తలు ఆశపడుతున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖవంటి నేతలు కూడా గ్యాప్‌ తర్వాత గాంధీభవన్‌ మెట్లెక్కారు.

రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినప్పటినుంచీ సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. మొదట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి నాయకులే నోరు విప్పితే తర్వాత అసమ్మతివాదులంతా ఏకమయ్యారు. వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్నా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలుచేసినా ఆయనపై అధిష్ఠానం ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నమే చేసింది. కొత్త ఇంచార్జి మొదటిసారి వచ్చినప్పుడు కూడా కోమటిరెడ్డి గాంధీభవన్‌కు రాలేదు. అయినా ఆయనకు నచ్చజెప్పి చివరికి గాంధీభవన్‌కు వచ్చేలా చేశారు. మొన్నటిదాకా కాంగ్రెస్‌తో తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడిన కోమటిరెడ్డి ఇప్పుడు సహకరిస్తానంటున్నారు. దీంతో ఆయనతో పాటు సీనియర్లు అలకపాన్పు దిగినట్లే భావిస్తున్నారు. కానీ అంతా బాగుందని కార్యకర్తలు అప్పుడే చంకలు గుద్దుకోడానికి లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్‌. ఆ మహాసముద్రంలో ఎప్పుడు ఏమన్నా జరగొచ్చు!