రాజ్‌గోపాల్‌ సన్యాసం… ఉత్తుత్తి శపథం

By KTV Telugu On 7 November, 2022
image

కొంతమంది రాజకీయ నాయకుల మాటలు వింటే అది నాలికా తాటిమట్టా అనిపిస్తుంది. అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. బహిరంగంగా మైకుల మందే నోటికొచ్చింది మాట్టాడి అడ్డంగా దొరికిపోతారు. శపథాలు చేస్తారు, ఛాలెంజ్‌లు విసురుతారు. తీరా పరిస్థితి తారుమారయ్యేసరికి తాను అలా అన్లేదని తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతారు. మునుగోడు ఉప ఎన్నికలో బిజీపే తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా అలాగే బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారం లో ఆయన ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గనక గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఛాలెంజ్ అంటూ మీడియా సమక్షంలో సవాల్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోను టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మునుగోడు ప్రజలు తనకే పట్టం కడతారని అనుకున్నారు రాజ్‌గోపాల్‌. ఆ ధీమాతోనే ఆయన మునుగోడులో తన విజయం పక్కా అని, ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. తీరా ఇప్పుడు ఆయన ఓడిపోయేసరికి తానన్న మాటల వీడియోను టీఆర్‌ఎస్‌ శ్రేణులు వైరల్‌ చేస్తున్నాయి.

టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలైన రాజగోపాల్ రెడ్డి మాటకు కట్టుబడతారా చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నాయి. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రాజగోపాల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. అంతకుముందు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిస్తే తాను రాజీనామా చేస్తానని చాలెంజ్‌ చేశారు. అక్కడ ఈటల గెలిచారు. దాంతో ఆయనపైనా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. రాజీనామా ఎప్పుడు చేస్తారని బీజేపీ కార్యకర్తలు డైరెక్టుగా గువ్వల బాలరాజుకు ఫోన్లు చేసి నిలదీశారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ లో చేరిన బండ్ల గణేష్‌ కూడా ఇలాంటి శపథమే చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే తాను మెడ కోసుకుంటానన్నారు. ఆ తరువాత మాట మార్చి ఎన్నో అంటాం అంత మాత్రాన మెడ కోసుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. ఈవిధంగా శపథాలు, ఛాలెంజులు చేసే నాయకులు ఆ తరువాత తూచ్‌ అనడం ఒక రివాజుగా మారింది.