బిజెపి అధిష్టానంపై కోమటిరెడ్డి ఆగ్రహం

By KTV Telugu On 8 November, 2022
image

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్‌ చేశారు బీజేపీ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అయితే ఆయన అంచనా తప్పింది. టీఆర్‌ఎస్‌ సుమారు పదివేల మెజారిటీతో గెలిచింది. గెలుపు తనదే అనుకున్న కోమటిరెడ్డికి నిరాశ తప్పలేదు. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న టీఆర్‌ఎస్ తన బలగాన్నంతా మునుగోడులో మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లు మునుగోడులో మకాం వేసి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ తో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్థి ప్రచారంలో వెనకబడిపోయారు. ఈ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం మీద కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నాయకులే తన ఓటమికి కారణమయ్యారని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి తాను సిద్ధపడినా బీజేపీ అగ్ర నాయకులు ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోలేదని, వారే తనకు ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బిజెపి కేంద్ర నాయకత్వం మీద ఆయన కోపంగా ఉన్నారు. మునుగోడులో తాను గెలిస్తే రాష్ట్ర బీజేపీలో తన ప్రాబల్యం పెరుగుతుందనే అక్కసుతో కొందరు స్థానిక నాయకులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. వాళ్లే కేంద్ర నాయకత్వం నుంచి తనకు పూర్తిస్థాయి మద్దతు అందకుండా మోకాలడ్డారనేది ఆయన నమ్ముతున్నారు. తాను ఓడిపోయిన తరువాత ఓడితే ఓడాంగానీ పార్టీ బలపడింది అనే నినాదంతో సమీక్ష సమావేశం నిర్వహించడం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యిందని సమాచారం. ఉప ఎన్నికలో తన తరుపున ప్రచారానికి అమిత్ షా వస్తారని అన్నారు. కానీ ఆయన రాలేదు. ఆ తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

సరిగ్గా నడ్డా సభ జరగడానికి ఒకటి రెండు రోజులు ముందుగా నడ్డా పర్యటన రద్దయింది. అప్పటికే మునుగోడులో పార్టీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ సమాచారంతో బీజేపీ అగ్ర నాయకులు ఒక నిర్ణయానికి రావడం వల్లే ప్రచారానికి రాలేదా అని ఇప్పుడు బీజేపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తన ఓటమికి ఇది కూడా ఒక కారణమని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. పార్టీ నుంచి తనకు సరైన సహకారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి గాని, కేంద్ర మంత్రులు గాని ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు వచ్చి చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనకు మద్దతు ఇచ్చి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని కోమటిరెడ్డి భావిస్తున్నారు. ఆ రకంగా పార్టీ తనను వంచించిందనే అభిప్రాయం రాజగోపాల్ లో ఏర్పడింది. ఇక ముందు పార్టీలో కోమటిరెడ్డికి బీజేపీలో తగిన ప్రాధాన్యం అయినా ఇస్తారా లేదంటే ఓడిపోయిన నేతకింద జమ కట్టి పక్కన పెట్టేస్తారో చూడాలి.