మా ఎంపీ దుర్మార్గుడు అన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

By KTV Telugu On 26 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తరపున ప్రచారం చేయకుండా అస్ట్రేలియా కు వెళ్లిపోయారు. పైగా తాను ప్రచారం చేసినా చేయకున్నా కాంగ్రెస్‌ గెలవదని వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డి వ్యాఖ్యాలపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీత‌క్క వెంకటరెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి, త‌న సోద‌రుడైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి వెంక‌ట‌రెడ్డి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఆమె మండిప‌డ్డారు. వెంక‌ట‌రెడ్డి ఓ దుర్మార్గుడ‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న వెంక‌ట‌రెడ్డిని కాంగ్రెస్ ప‌క్క‌న పెట్టాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీగా వుంటూ, బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని వెంక‌ట‌రెడ్డి ఎలా ప్ర‌చారం చేస్తార‌ని సీతక్క నిల‌దీశారు. రాజ‌కీయాలంటే బంధాలకు అతీత‌మ‌న్నారు. త‌మ్ముడే గెల‌వాల‌ని అనుకుంటుంటే కాంగ్రెస్ కండువాకు బ‌దులుగా బీజేపీ కండువా వేసుకోవాల‌ని అన్నారు. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిల‌వ‌కుండా ఆస్ట్రేలియాకు వెళ్ల‌డం ఏంట‌ని వెంకటరెడ్డిని నిల‌దీశారు. ఈమధ్యే వెంకటరెడ్డి తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ తమ పార్టీ నేతకు సూచిస్తున్న ఆడియో ఒకటి కలకలం రేపింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లరా అని మీడియా అడిగినప్పుడు తాను హోమ్‌గార్డు లాంటివాడినని, ఎస్పీ స్థాయి వారే పార్టీని గెలిపిస్తారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యంగాస్త్రాలు సంధించారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో వర్గ పోరు మరోసారి బయటపడింది.