కోమటిరెడ్డిని కాంగ్రెస్‌ బతిమాలుకుంటోందా!

By KTV Telugu On 13 January, 2023
image

పాపం కాంగ్రెస్‌. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసినా అధికారంలోకి రాలేకపోయింది. పార్టీ ఉనికికోసం అదే గడ్డపై పాకులాడుతోంది. టీపీసీసీ నిట్టనిలువునా చీలిపోయింది. చివరికి అధినాయకత్వం రాష్ట్ర ఇంచార్జినే మార్చేసింది. అయినా పార్టీ బతికి బట్టకడుతుందన్న ఆశల్లేవు. కొత్త ఇంచార్జి మాణిక్‌రావ్‌ థాక్రే ప్రయత్నాలు మంచంమీద క్షణాలు లెక్కపెడుతున్న రోగికి తులసితీర్థం పోస్తున్నట్లే కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్న నాయకుడ్ని బతిమాలుకోవాల్సి రావడం తెలంగాణ కాంగ్రెస్‌ దయనీయపరిస్థితికి దర్పణం పడుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ ఎంపీ. పార్టీ సీనియర్‌ లీడర్‌. ఆయన తమ్ముడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేశారు. చివరికి బైపోల్‌లో ఓడిపోయారు. తమ్ముడు బీజేపీలో చేరటంతో వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన గాంధీభవన్‌ గడప కూడా తొక్కలేదు. నేనే కాంగ్రెస్‌, కాంగ్రెస్సే నేను అన్నట్లు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రమ్మని ఆహ్వానించినా గాంధీభవన్‌ వచ్చేది లేదని పార్టీని ఇంకాస్త పలుచన చేశారు. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని క్యాంప్‌ కార్యాలయంలోనే కోమటిరెడ్డితో కొత్త ఇంచార్జి భేటీ అయ్యారు.

ఏఐసీసీ షోకాజ్‌ నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టిష్యూల కంటే హీనమైపోయాయి. అవెప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని అంటున్నారు. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో తానెందుకు కూర్చుంటానని ప్రశ్నించారు. పార్టీకి ఇన్నాళ్లుగా దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గంటపైనే భేటీ అయ్యారు మాణిక్‌రావ్‌థాక్రే. కొత్త ఇంచార్జితో అన్నీ మాట్లాడాక కూడా తగ్గేదేలేదన్నట్టుంది కోమటిరెడ్డి వ్యవహారశైలి. పార్టీతో కలిసి రాకున్నా, ఆమధ్య ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయినా తమ్ముడు బీజేపీలో ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జోలపాట పాడుతూనే ఉంది కాంగ్రెస్. ఆయన సేవలు అవసరం అనుకుంటోంది. మరి కాంగ్రెస్‌ అవసరమని ఆయన అనుకుంటున్నారా లేదా? పిలిచి మాట్లాడారన్న మర్యాదకైనా కాంగ్రెస్‌తో ఉంటారా? తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిలాగే జెండా ఎత్తేస్తారా? మాణిక్కంతో కానిది మాణిక్‌రావ్‌తోనూ కాదని కాంగ్రెస్ పెద్దలకు త్వరలోనే తెలిసొస్తుందా? ఎవరు తోకజాడించినా ఆ పార్టీ ఇక కళ్ళప్పగించి చూడాల్సిందేనా? హేవిటో.