మునుగోడు ఫలితం రాజగోపాల్‌కు మేలు చేసినట్లేనా

By KTV Telugu On 7 November, 2022
image

మునుగోడు మొనగాడు ఎవరో తేలిపోయింది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి కేసీఆర్‌కు షాకి్ ఇవ్వాలనుకున్న బీజేపీ చతికిల పడింది. ఈ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డింది. మొత్తం తెలంగాణ మంత్రులు అంతా అక్కడే వుండిపోయారు. వెయ్యి ఓట్లు కూడా లేని గ్రామాలను ఒక్కో మంత్రి కి అప్పగించారు. డబ్బులు, చికెన్‌, మటన్‌, మందు విందులతో నెలరోజులు సందడిగా గడిచిపోయింది. ఇంతా చేస్తే కేవలం పదివేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది టీఆర్‌ఎస్‌. ఒక్కో మంత్రి పర్యవేక్షించిన చోట వచ్చిన మెజారిటీ రెండు వందలు నుంచి అయిదు వందల ఓట్లు. అంటే ఓ మంత్రి కొన్ని రోజుల పాటు కూర్చుని సాధించిన మెజారిటీ అది. ఇక ఎమ్మెల్యేలు అయితే చెప్పనక్కరలేదు. నాయకుల సంగతి సరేసరి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే మునుగోడులో ఖర్చు చేసినట్లు రేపు జనరల్ ఎలక్షన్ లో చేయడం అసాధ్యం.

ఇప్పుడు మునుగోడులో తిష్టవేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అప్పుడు వారి నియోజకవర్గాల్లో పోటీలో వుంటారు. ఇప్పుడు ఒకే నియోజకవర్గం కాబట్టి వందల కోట్లు కుమ్మరించారు. జనరల్ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి గనక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన గెలపునకు పలు అంశాలు దోహద పడే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం టైముంది. ఈ సంవత్సరం అంతా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం లభించింది. తన ఓటమికి కారణాలు విశ్లేషించుకుని తప్పులు సరిదిద్దుకునే సమయం దక్కింది. పైగా ఉప ఎన్నికలో ఓడిపోయాడనే సానుభూతి కూడా రాజగోపాల్‌ రెడ్డి కి కలిసొస్తుంది. అందువల్ల మునుగోడు ఓటమి రాజగోపాల్‌కు మేలే చేసిందంటున్నారు బీజేపీ కార్యకర్తలు.