మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు

By KTV Telugu On 16 October, 2024
image

KTV TELUGU ;-

ఏ ముహుర్తాన అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకున్నారో గానీ.. అప్పటి నుంచి ఆమెకు కాలం కలిసి రావడం లేదు. ఏదోక సమస్య ఆమెను వెంటాడుతోంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ ఇంటి పోరు ఆమె మెడకు చుట్టుకుంటోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆమెకు షాకిస్తున్నారు. మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు ఇబ్బందులు పెడుతున్నారని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు సైతం ఫిర్యాదు చేశారు. నిజానికి పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ భర్త కొండామురళి, ఎమ్మెల్యే రేవూరి వర్గీయుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయడం.. వెంటనే ఆమె ఆటో కట్టుకుని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో ఘర్షణ పడటం కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సైతం వార్తలు వినిపిస్తుండగా ఫిర్యాదుల వెల్లువ మొదలైంది..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల వర్గ పోరు అధిష్టానానికి శిరోభారంగానూ, కార్యకర్తలకు ఇబ్బందిగానూ మారింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వివాదం ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పాలి. మిగతా నియోజకవర్గాల్లోనూ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ చోట ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొండా, రేవూరితో పాటు ఇనుగాల వెంకటరామిరెడ్డి వర్గం కూడా ఇప్పుడు ఆధిపత్య పోరు కోసం ప్రయత్నిస్తోంది. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కూడా వివాదాస్పదమైంది. కొండా కుటుంబానికి చెప్పకుండానే అధిష్టానం ఈ పని చేయడంతో ఆ ఫ్యామిలీ రగిలిపోతోంది. దమ్ముంటే రాజీనామా చేసి పార్టీ మారాలని పోచమ్మ మైదాన్ సెంటర్ వేదికగా కొండా మురళీ చేసిన సవాలు ఇప్పుడు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త చెవిలో మారుమోగుతోంది. మేయర్ గుండు సుధారాణిది కూడా తూర్పు ప్రాంతమే కావడంతో అక్కడ తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా మంత్రులున్నారు. కొండా సురేఖ, సీతక్క మినిష్టర్లుగా సమర్థంగా పనిచేస్తున్నారన్న ప్రశంసలున్నాయి. అయితే వారిద్దరూ సొంత నియోజకవర్గం దాటి పక్కకు వెళ్లలేరన్న చర్చ కూడా జరుగుతోంది.సాధారణంగా జిల్లా మంత్రి అంటే కొంత పరపతి ఉంది. గౌరవ మర్యాదలు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. మహిళా మంత్రులను ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు కూడా వాళ్లను పిలిచిన పాపాన పోలేదని చెప్పుకుంటున్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీని ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ వచ్చినప్పుడు కూడా ఆ ఇద్దరినీ ఆహ్వానించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. సీతక్క రాలేదు. సురేఖ వచ్చినా మొక్కుబడిగా వ్యవహరించారని స్థానికంగా వినిపించిన మాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా..ఇంచార్జిలకు ఉన్న ప్రాధాన్యం సొంత జిల్లా మంత్రులకు దక్కడం లేదు. వాళ్లు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు వాళ్లను లెక్కచేయడం లేదు… అదీ అసలు సంగతి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి