తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి కొత్త సొబగులు అద్దే బృహత్కార్యాన్ని తలపెట్టారు సీఎం కేసీఆర్. వందలాంది మంది స్థపతులు అహర్నిషలు శ్రమించి యాదాద్రికి సరికొత్త రూపునిచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మరో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈనెల 14తేదిన ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్నిఆయన దర్శించుకుంటారు. అక్కడే సంబంధిత అధికారులతో ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై చర్చిస్తారు. ఇప్పటికే కొండగట్టు దేవాలయం అభివృద్ధికి 100కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.
కొండగట్టు పరిసరాలను పరిశీలించి ఆలయ అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఆయన రూపొందించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు, ఆలయ గోపురాల డిజైన్స్ రూపొందించింది ఆనంద సాయే. అందుకే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా ఆయనకే అప్పగించారు కేసీఆర్.
తెలంగాణలో కొండగట్టు దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాహన పూజలతో పాటు ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే ఆలయాల్లో ప్రముఖమైనది పేరొందింది. ఇటీవలే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ఇక్కడే పూజలు చేయించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించడంతో త్వరలోనే కొండగట్టు మరో యాదాద్రిగా అవతరించబోతోందని స్థానికులు, అంజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.