ఏడో స్సారి

By KTV Telugu On 13 December, 2023
image

KTV TELUGU :-

ఒకటి కాదు రెండు కాదు  ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో ఘన విజయాలు సాధించారు బి.ఆర్.ఎస్. మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ ఎన్నికల్లో ఏడో సారి గెలిచి కాలర్ ఎగరేద్దాం అనుకున్నారాయన. తన విజయానికి ఎలాంటి ఢోకా లేదని చాలా ధీమాగా ఉన్నారు కూడా. అయితే ఎన్నికల్లో ఆయన పరాజయం పాలు కావడంతో  ఎక్కడ తేడా జరిగిందో అర్ధం కాక తలపట్టుకున్నారు కొప్పుల. అభివృద్ధి చేసినా  ఓడిపోతారా? ఎవరైనా? అని కొప్పుల తన ఆంతరంగికుల దగ్గర చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అయితే మితిమీరిన విశ్వాసమే ఆయన కొంపలు ముంచిందని  రాజకీయ పండితులు అంటున్నారు. పథకాల అమలుపై సరియైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓటమికి కారణం కావచ్చునంటున్నారు.

ఎన్నికల్లో వరుస విజయాలు లభిస్తుంటే ఇక తమకు తిరుగులేదనే భావన కల్గిస్తాయి. ఆ అతి విశ్వాసమే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొంప ముంచింది. ఈశ్వర్ కు చాలా సౌమ్యుడనే పేరున్నా… గత మూడు సార్ల నుంచి ఆయన  ప్రజాసమస్యలను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల గోడు వినిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. అదే ప్రజలు ఆయనకు దూరం అయ్యేలా చేసిందంటున్నారు. తన అనుచరుల ఆగడాలను చూసీచూడనట్టుగా వదిలేశారనే టాక్ బలంగా వినిపించింది. ఇలాంటి కారణాలెన్నో కొప్పులకు తలబొప్పి కట్టించాయి. నాటి మేడారం నుంచి నేటి ధర్మపురి వరకూ ఆరుసార్లు అప్రతిహతంగా గెల్చిన కొప్పులకు.. ఏడోసారి ఓటమిని రుచి చూపించాయి.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కొప్పుల అనుచరుల ఆగడాలు ఒకటీ రెండూ కాదు..చెబితే చాట భారతమంత అన్నట్టుగా ప్రచారంలోకొచ్చాయి. ధర్మపురిని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కొప్పుల ఖాతాలో ప్లస్ పాయింటైతే… ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై జనం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎలాంటి పరిహారం అందించకుండా సామాన్యుల ఇళ్లను ఇష్టారీతిన కూల్చేయడంపై ధర్మపురి కొంతకాలం పాటు రగిలిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దూరిపోయే కొందరు నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో.. సహజంగానే మున్సిపల్ పరిధిలో గులాబీపార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది.

నియోజకవర్గ అభివృద్ధి ఊహించిన స్థాయిలో జరగకపోవడం.. పైస్థాయి అధికారుల నుంచి, మున్సిపల్ పాలకవర్గం వరకూ పైసా లేందే ధర్మపురి మున్సిపాలిటీలో పని కాకపోవడం.. తలాపునే గోదావరి ఉన్నా ధర్మపురితో పాటు చాలా ఊళ్లల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగకపోవడం వంటి అనేక సమస్యలు కొప్పుల పరిష్కరించలేకపోయారనే చర్చ జనంలో తీవ్రస్థాయిలో జరిగింది. కొప్పుల ఆరుసార్లు గెల్చేందుకు ఎంత కష్టపడ్డారో.. ఆ కష్టమంతా ఒక్కసారిగా బుగ్గిపాలైపోయింది.

మంత్రిగా ఉన్న నేత ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ అందరితో కలుపుగోలుగా ఉంటే ఆ కమ్యూనికేషన్స్ కూడా తమ కెరీర్ కు ఉపయోగపడతాయి. సరిగ్గా ఈ పాయింట్ ను క్యాచ్ చేయడంలో కూడా కొప్పుల విఫలమయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అంటీముట్టనట్టుగా కనిపించిన కొప్పుల.. కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఏ కొందరితోనో మినహాయిస్తే.. మిగిలిన నాయకులతో అంతగా కలిసిపోయేవారు కాదు. వీటన్నింటితో పాటు… మీడియాతో సత్సంబంధాలు లేకపోవడం.. ప్రోయాక్టివ్ గా ఉండకపోవడం.. పైగా ఆరు సార్ల నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రావడంతో సహజంగానే ఏర్పడ్డ వ్యతిరేకత.. ఓటర్లు మార్పు కోరుకోవడం వంటివెన్నో ఈసారి కొప్పుల విజయావకాశాలకు గండికొట్టాయి.

దీంతో ముందు నుంచీ ప్రచారం జరిగినట్టే… తన చిరకాల ప్రత్యర్థి అడ్లూరిపై కొప్పుల ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చంది. ఆరు సార్లు గెలిపించిన ప్రజలు ఏడోసారి ఓడించడం కొప్పులకు మింగుడు పడటంలేదు. కాని ఆయన పనితీరు, అనుచరుల ఆగడాలు, కలుపుగోలుతనం లేకపోవడం వంటి అనేక కారణాలు కొప్పుల ఓటమికి కారణం అని ధర్మపురిలోని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు..ఆ గెలుపును నిలబెట్టుకోలేకపోతే చివరికి ఓటమి తప్పదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి