జైల్లో రెస్ట్ తీసుకునేందుకు రెడీ అంటున్న కేటీఆర్

By KTV Telugu On 9 November, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో తప్పేముందీ, ఒక నాయకుడు మరో నాయకుడికి బర్త్ డే విషెస్ చెప్పడానికి అభ్యంతరాలు ఏముంటాయి…అని అనుకోవచ్చు. కాకపోతే అందులోనే ఒక ట్వీస్ట్ ఉంది. శుభాకాంక్షలు చెబుతూనే కేటీఆర్ మరో క్షిపణి పేల్చారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ప్రభుత్వ ఏజెన్సీలు రావచ్చని.. వారికి స్వాగతం పలుకుతామని ప్రకటించారు. ఈ క్రమంలో తన మలేషియా పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఏజెన్సీలు వస్తే చాయ్, ఉస్మానియా బిస్కెట్లతో రెడీగా ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయాలనుకున్నామని కూడా ఆయన చెప్పుకున్నారు..

తాజా ట్వీట్ వెనుక దాదాపు రెండు నెలల రాజకీయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అగ్ర నేతలను అరెస్టు చేయబోతోదంటూ ఏరోజుకారోజు ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని .. ఏ తప్పూ చేయని తాము భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు కూడా సమాధానం చెబుతూనే ఉన్నారు. గురువారం కూడా కేటీఆర్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు.ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని కేటీఆర్‌ అన్నారు. అయినా తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్‌పైశాచికానందం పొందాలనుకుంటే అందుకు సిద్ధమని ప్రకటించారు. ‘‘జైల్లో ఉంటే ఏమవుతుంది? అక్కడ యోగా చేసి బయటకు వస్తా. తర్వాత పాదయాత్ర చేపడతా’’ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా-1 రేస్‌ కోసం 2003లోనే అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు. సంస్థ సీఈఓను కూడా కలిశారని చెప్పారు. గోపన్‌పల్లి దగ్గర భూమి సైతం కేటాయించారని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక ఫార్ములా వన్‌ రేసింగ్‌ కోసం చంద్రబాబు ఆలోచననే కొనసాగించామన్నారు…

ఈ లోపే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా తనదైన శైలిలో మరో సారి దూకుడును ప్రదర్శించారు.దీపావళికి బాంబులు పేలతాయని గతంలో ప్రకటించిన పొంగులేటి ఇప్పుడు కాస్త డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. ‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. పేదోడి సొమ్మును సోకుల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం విదేశాలకు బదిలీ చేస్తే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. కోట్లాది రూపాయలు ఎవరు ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలుపుతాం. కేటీఆర్‌.. పాదయాత్ర చేస్తావో.. మోకాళ్ల యాత్ర చేస్తావో.. త్వరగా నిర్ణయించుకో. తెలంగాణ ప్రజలు మరోసారి నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది..

నిజానికి రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే తడవుగా… బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో అవకతవకలకు సంబంధించి విచారణకు కమిషన్ కూడా వేసింది. దాని ఆధారంగా కేసీఆర్, కేటీఆర్ మరికొందరినీ అరెస్టు చేస్తారని భావించారు. ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా నానుతూనే ఉంది. కొందరు అధికారులు జైల్లో ఉన్నారు. ఆ కేసు హరీష్ రావు మెడకు చుట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ రాత్రికి ఏమైనా జరగొచ్చు రెడీగా ఉండండి అంటూ గత వారం కేటీఆర్ ట్వీట్ చేసినప్పుడు ఇక అరెస్టే అని అందరూ ఎదురుచూశారు. పైగా కేసీఆర్ కుటుంబాన్ని దీపావళి జరుపుకోకుండా ఆపుతారని కూడా ప్రచారం జరిగింది. అవన్నీ జరగకపోయినా..ఇప్పుడు మాత్రం కేసులు వేగం పెరిగాయని అంటున్నారు. అందుకే మేము రెడీ.. జైలులో రెస్ట్ తీసుకుంటామని కేటీఆర్ చెబుతున్నారు. అరెస్టు ఎప్పుడనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అది ఇవాళైనా కావచ్చు. రేపు అయినా కావచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి