ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. అసెంబ్లీ నుండి లోక్ సభ స్థానాల వరకు అన్ని పార్టీల్లోనూ ఛాలెంజ్ ల పర్వం సాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటు తెలంగాణాలోనూ ఈ సవాళ్లు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రజలకు కావల్సినంత వినోదమూ లభిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నయా సవాల్ విసిరారు. దమ్ముంటే మల్కాజగిరి లోక్ సభ స్థానం నుండి ఇద్దరం పోటీ చేద్దాం రా అంటూ ఛాలెంజ్ చేశారు కేటీయార్.
తెలంగాణాలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ను కనీసం ఒక్క లోక్ సభ స్థానంలో అయినా గెలిపించి చూపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్. నాయకుడు మాజీ మంత్రి కేటీయార్ కు సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు కేటీయార్. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజగిరి లోక్ సభ స్థానంలోనే ఇద్దరం పోటీ పడదామంటూ ఆయన సవాల్ చేశారు. సిఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేసి మీ సిటింగ్ సీటు మల్కాజగిరి బరిలో దిగండి. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ ఎన్నికల బరిలో దిగుతా. మల్కాజగిరిలో మీరు గెలుస్తారో నేను గెలుస్తానో చూసుకుందాం అని కేటీయార్ బహిరంగంగా సవాల్ చేశారు.
కేటీయార్ సవాల్ విసరడానికి కారణం లేకపోలేదు. మల్కాజగిరి లోక్ సభ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. అభ్యర్ధులే గెలిచారు. ఆ మాటకొస్తే గ్రేటర్ పరిధిలో అన్ని స్థానాలనూ బి.ఆర్.ఎస్.-మజ్లిస్ పార్టీలే పంచుకున్నాయి. ఒక్క చోట మాత్రమే బిజెపి గెలిచింది. కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మల్కాజగిరిలో పోటీ చేస్తే తన విజయం నల్లేరుపై బండి నడకే అని కేటీయార్ భావిస్తున్నట్లుందంటున్నారు రాజకీయ పండితులు. కేటీయార్ సవాల్ కు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
తెలంగాణాలో కాంగ్రెస్ -బి.ఆర్.ఎస్. ల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోన్న తరుణంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి-జనసేనల ఉమ్మడి సభ జరిగింది. టిడిపి-జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్టీ స్థానాలు మూడు లోక్ సభ స్థానాలు కేటాయించింది టిడిపి. దీనిపై జనసైనికుల్లోనూ కాపుల్లోనూ అసంతృప్తి రాజుకుంది. దీనిపైనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కూడా పవన్ పై సెటైర్లు వేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జెండా సభలో వైసీపీపైనా జగన్ మోహన్ రెడ్డి పైనా నిప్పులు చెరిగారు. అహంకారంతో పేట్రేగిపోవద్దు జగన్.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేయకపోతే నా పేరు పవన్ కాదు…. నా పార్టీ జనసేన కాదు అంటూ పవన్ ఆవేశంతో ఊగిపోయారు. రానున్నది టిడిపి-జనసేన ప్రభుత్వమే అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేస్తానంటోన్న పవన్ కళ్యాణ్ ముందుగా తాను ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలని పాలక పక్ష నేతలు సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారు కాబట్టే 24 సీట్లతో సరిపెట్టుకున్నారని..తనను నమ్ముకున్న జనసైనికులను ముంచేశారని విమర్శించారు. కాపుల ప్రయోజనాలను, మనోభావాలను పవన్ కళ్యాణ్ దారుణంగా దెబ్బతీశారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు.
ఇక తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ బి.ఆర్.ఎస్., కాంగ్రెస్ పార్టీలు రెండింటికీ సవాళ్లు విసురుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లు బోణీ కూడా కొట్టలేవని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోయేది బిజెపియేనని ఆయన జోస్యం చెప్పారు. ఇండియా కూటమి కకావికలమైపోయిందని..కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బిజెపి నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీలూ ఎన్నికల వేళ సవాళ్లతో రెచ్చగొట్టుకుంటున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…