బీఆర్ఎస్ సంక్షోభంలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని సమస్యలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా లేవు. తెలంగాణ జాతీయ పార్టీల బరి అవుతోందని సంకేతాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న నేతలకు ఇలాంటి పరిస్థితులు సంక్షోభంలో అవకాశాలు సృష్టిస్తాయి. అలాంటి అవకాశం కేటీఆర్ కు వస్తోంది. కేటీఆర్ అందిపుచ్చుకుంటే… తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత క్రమంగా బలహీనపడుతోంది. కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఫీల్డ్ లోకి దిగి పోరాడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్‌కు యువరక్తం కావాలి. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తెరపైకి వచ్చారు. ఆయన బలంగా తనదైన ముద్ర వేశారు. అయితే అంతా అధికారపార్టీలో ఉండగానే. ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోరాడి తన రాజకీయ సామర్థ్యాన్ని నిరూపించుకుని బీఆర్ఎస్ జనవసత్వాలు అందించే అవకాశం ఇప్పుడు ఆయనకు వచ్చింది.
తెలంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చారు. ఇప్పుడు బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. పార్టీని మంచినా తేల్చినా ఆయనదే భారం. కొత్త తరం రాజకీయ వ్యహాలతో ముందుకు వెళ్లి యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కేటీఆర్ అదే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేసులకు భయపడటం లేదు. కేటీఆర్ రాజకీయనాయకుడిగా ఇంకా పూర్తి స్తాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంత వరకూ చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదు. పూలపాన్పు మీద అన్నట్లుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే ఉద్యమ బలం అంతా పార్టీకి వచ్చింది. అప్పట్నుంచి అధికారం అనుభవించారు. కానీ ఇప్పుడు ముళ్లబాట ప్రారంభమయింది.
కేటీఆర్ కు ఇప్పుడే అవకాశం వచ్చింది. తాను కూడా రాజకీయ నాయకుడ్నని.. నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయా లేదా అన్నదానిపై బీఆర్ఎస్ లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ వయసు అయిపోయి స్లో అవుతున్న సమయంలో అఖిలేష్ యాదవ్ మెల్లగా పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన నేరుగా పదవిలోకి రాలేదు. పార్టీని గెలిపించారు. ఇందుకోసం యూపీ అంతా విస్తృతంగా పర్యటించారు. ములాయంనే చూపించి ఎన్నికల ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అందరూ ఆయననే సీఎంగా ఎన్నుకున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అఖిలేష్ చేసిన పోరాటం వల్లే రెండు సార్లు ఓడిపోయినా ఇంకా ప్రధానంగా పోరాడుతోంది ఎస్పీ. అలాంటి పునాదుల్ని.. నాయకత్వాన్ని ఇప్పుడు కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తోందని అనుకోవచ్చు.
అయితే అది అంత చిన్న విషయం కాదు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నందున వచ్చే అనేక సమస్యలతో పాటు రాజకీయ వేధింపులను సైతం బలంగా ఎదుర్కొని నిలబడాల్సి ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని ప్రజల్లోనే ఉండి పోరాడాల్సిఉంది. పార్టీకి క్యాడర్ కు నిరంతరం అందుబాటులో ఉంటూ… ఎవరూ పక్క చూపులు చూసుకోకుండా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం తడబడితే.. జరిగే నష్టం కేటీఆర్‌కే కాదు.. బీఆర్ఎస్ పార్టీకి కూడా.
రాజకీయాలు అంటేనే రోలర్ కోస్టర్ రైడ్. ఓ సారి ఎంతో ఎత్తులో ఉంటారు.. మరో సారి పాతాళంలో ఉంటారు. అన్నీ తట్టుకోగలిగితేనే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలరు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…