సారీ కేటీఆర్ – మైనస్‌లో “రేస్” మైలేజ్

By KTV Telugu On 12 February, 2023
image

హైదరాబాద్ వాసులకు క్షమాపణలుపెద్ద మనసుతో మన్నించాలి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ గత రెండు వారాలుగా తిప్పలు పడిన ప్రజలు కేటీఆర్ చెప్పిన ఈ చిన్న సారీకి కూల్ అవుతారా. అసలు నగరం నడి బొడ్డున అంత బిజీ రూట్‌లో ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది. ప్రజాధనం ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేసి ఆ ప్రజలనే ఇబ్బంది పెట్టడం ఎందుకు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే ఇలా ప్రజాపయోగ రోడ్లను ఉపయోగించుకోవాలా. ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేసుకోవాలా. ఇవన్నీ సారీ చెప్పిన కేటీఆర్‌కు సహజంగా ఎదురయ్యే ప్రశ్నలు.

హైదరాబాద్‌లో జరిగింది ఫార్ములా వన్ రేసులు కాదు. ఫార్మలా ఈ కార్ రేసులు. అంటే ఎలక్ట్రిక్ కార్ల రేసులు. వీటికి ఇంకా ప్రపంచంలో అంత ఆదరణ రాలేదు. కానీ మోటార్ ప్రపంచం హై ఫై లైఫ్ అనుభవించే వారికి మాత్రమే వీటిలో క్రేజ్ ఉంది. నిజంగా హైదరాబాద్ వాసుల్లో ఒక్క శాతం కూడా ఈ ఫార్ములా రేసులపై ఆసక్తి చూపించలేదు. ఈ రేసులు నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే పేరు ప్రఖ్యాతులు కూడా పెద్దగా ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ట్రాక్ లేదు. ఇలాంటి రేసులు ఇతర విభాగాల్లో నిర్వహించుకోవడానికి ఇతర సంస్థలు ముందుకు రావడానికి కూడా అవకాశం లేదు. ఓ ఈవెంట్ జరిగిందా అంటే జరిగింది అంతే. కానీ హైదరాబాద్ వాసులకు ఎదురైన కష్టాలు మాత్రం మనసులో ఉండిపోతాయి.

ఫార్ములా ఈ రేస్ చూసేందుకు చాలా పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, స్పోర్ట్స్ స్టార్స్ అందరూ వచ్చారు. వారిలో హైదరాబాద్ వాళ్లెవరూ ఉండరు. వారంతా సాఫీగా వచ్చి సేఫ్ గా వెళ్లిపోయారు. కానీ వారికి ఈ ప్లెజర్ అందించేందుకు రెండు వారాల పాటు హైదరాబాద్ వాసులు నారా నరకం చూశారు. గంటలో ఆఫీసుకో ఇంటికో చేరాల్సిన వారు నాలుగైదు గంటలు రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. ఇది మాటల్లో చెబితే తెలిసే నరకం కాదు. అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇంత కష్టం వారెందుకు పడాలి.

ఇంతా చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా అంటే ఖర్చుల్లో ఉన్న ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్పితే రూపాయి ఆదాయం లేదు. ఈ రేసు నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ ఉత్సాహం చూపించడం వల్లే ఈ రేసులను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వాహకులు చెప్పినట్లే రూ. కోట్లు ఖర్చు పెట్టి రేసులు నిర్వహించిన హుస్సేన్ సాగర్ చుట్టుపక్కన రోడ్లను అభివృద్ధి చేశారు. ఇతర ఏర్పాట్లు చేశారు. ఈ రేసుల నిర్వహణ కోసం అయిన ఖర్చంతా తిప్పలు పడ్డ ప్రజలదే. అంటే ప్రజలే కష్టాలు పడ్డారు. వారు పన్నుల రూపంలో చెల్లిన సొమ్ముతోనే ఈ ఈవెంట్ నిర్వహించారు.

అసలు రేసును సిటీ మధ్యలో నిర్వహించడం ఏమిటన్నది చాలా మందికి ఇప్పటికీ డౌట్. ప్రపంచంలో ఎక్కడైనా ఫార్ములా రేసులంటే ఖచ్చితంగా సెపరేట్ ట్రాకులు ఉంటాయి. లేకపోతే నిర్వహించరు. కానీ హైదరాబాద్‌లో మాత్రం జనబాహుళ్యం రోజువారీ అవసరాలకు ఉపయోగించుకునే రోడ్లనే వాడారు. మామూలుగా ఇలాంటి రోడ్లను రిపేర్ల కోసం ఒక్క రోజు బ్లాక్ చేసినా ప్రజల నుంచి ప్రభుత్వానికి శాపనార్ధాలు వస్తాయి. కానీ ఇక్కడ అలాంటివి రెండు మూడు వారాల పాటు ప్రభుత్వం భరించింది. అసలు ఇంత ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎందుకు సొంతంగా ట్రాక్ నిర్మిస్తే ఇతర టోర్నీలకూ ఉపయోగపడేది. ఓ మౌలిక సదుపాయం కూడా వచ్చి ఉండేది కదా అన్నది సామాన్యులకు వచ్చే డౌట్.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా సామాన్య ప్రజల ఆలోచనలకు దూరంగా ప్రపంచపటంలో హైదరాబాద్‌ను పెట్టాలని ఎక్కడో ఆలోచించేవారు. అప్పట్లోనే ఆయన గోపన్ పల్లిలో ఫార్ములా వన్ రేస్ ట్రాక్ నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయన ఉంటే ఏమయ్యేదో కానీ అధికారం పోయింది కాబట్టి సాధ్యం కాలేదు. ఇప్పుడు గోపన్ పల్లి అంతా రియల్ ఎస్టేట్ ప్రపంచం. సర్కార్ భూమి లేదు ఉన్నా అమ్మేశారు. కానీ కందుకూరు ఫార్మా సిటీ దగ్గర ప్రభుత్వానికి పది వేల ఎకరాల వరకూ భూమి ఉంది. అలాంటి చోట శాశ్వత ట్రాక్ నిర్మిస్తే ప్రపంచ కార్ రేసుల పటంలో హైదరాబాద్‌కు ఓ శాశ్వత చిరునామా దక్కేది. కానీ కేటీఆర్ తాత్కాలిక ఆలోచనలే చేయడంతో అటు ఎవరైనా వచ్చి చూస్తే ఈ రోడ్ల మీద రేస్ నిర్వహించారా అని ఆశ్చర్యపోతారు. ఈ రేసు గుర్తుకొస్తే తిప్పలు పడిన ప్రజలు తిట్లందుకుంటారు.

ఈ రేసులకు వచ్చిన వారందరూ కేటీఆర్ ను అభినందించారు. సెలబ్రిటీలు అందరూ ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. ఇది కేటీఆర్ విజయం అని పొగిడారు. అందరూ హైఫై. చాలా మంది బయట రాష్ట్రాల వాళ్లు కానీ ఆయనను తిట్టుకున్న వారు మాత్రం హైదరాబాదీలే. పొగిడిన వారు పదుల్లో ఉంటే తిట్టుకున్న వారు లక్షల్లో ఉన్నారు. ఇంకా అసలు విషయం ఏమిటంటే ఆ పొగిడిన వారికి కనీసం తెలంగాణలో ఓటు ఉండదు. కానీ తిట్టుకున్న వారందరూ రేపు ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరుపై తీర్పు చెప్పాల్సిన వారే. కేటీఆర్ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారన్నది చాలా మందికి ఊహకందని సమాధానం.

హైదరాబాద్‌లో ఉండే వారంతా తాము ఇబ్బందిపడినా రేసులు గొప్పగా నిర్వహించాలని అనరు. ఇతరులకు ముఖ్యంగా హై క్లాస్ వర్గాలకు లభించే ఏ కంఫర్ట్ లేదా లగ్జరీ అయినా తమను ఇబ్బంది పెట్టి పొందాలని భావిస్తే కింద తరగతి వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. రేసుల వల్ల కేటీఆర్‌కు ఏ మాత్రం మైలేజ్ రాకపోగా సామాన్యుల్లో మాత్రం మైనస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది.