పొంగులేటిని స్పెషల్ గా టార్గెట్ చేసిన బీఆర్ఎస్

By KTV Telugu On 26 November, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆటం బాంబుల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు మంచి స్నేహితులైన వారిద్దరూ కేటీఆర్ తండ్రి కేసీఆర్ వైఖరి కారణంగా దూరం జరిగిన మాట వాస్తవం. అయితే ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. దాదాపుగా రోజువారి విమర్శలు సంధిస్తున్నారు..ఏ కార్యక్రమానికి వెళ్లినా బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కేటీఆర్ ఆయనకు కౌంటర్లు మొదలు పెట్టారు. ఒక పెద్ద కాంట్రాక్టరు, వ్యాపారవేత్త అయిన పొంగులేటి కార్యాలయాలపై కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు దాడులు చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పుడో ఆసక్తికర ట్వీట్ చేశారు. దాడులకు సంబంధించి ఏమైనా అప్ డేట్ ఉందా అని ఈడీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించడం ఆ ట్వీట్ సారాంశం అని చెప్పక తప్పదు. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేసి 60 రోజులు దాటింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఒక్క ఫొటో, ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. అసలు లోపలికి వెళ్లిన రెండు కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయి? అని ఈడీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నిశ్శబ్దం ఎందుకని అడిగారు. కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈడీ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో దాడులు నిర్వహించారు. మొత్తం ఢిల్లీ నుంచి 16 ఈడీ బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని.. ఏకకాలంలో హైదరాబాద్‌, ఖమ్మంలోని 15 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు వార్తలు వినిపించాయి.కేటీఆర్ ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు….

వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పొంగులేటి బీఆర్ఎస్ లో చేరారు. ఖమ్మం జిల్లాకే చెందిన ప్రస్తుత మంత్రి తుమ్మలకు ఆయనకు పడలేదని చెబుతారు. 2019లో తుమ్మల ఓటమికి పొంగులేటి కారణమని కేసీఆర్ కు నివేదిక అందడంతో ఆయన దూరం పెట్టారు. పొంగులేటికి కేసీఆర్ కు మధ్య రాజీ కుదిర్చేందుకు కేటీఆర్ ప్రయత్నించినప్పటికీ అది నేరవేరలేదు.పార్టీ పనులు కోసం కేసీఆర్ ఒక సందర్భంలో వారం రోజులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనతో డీటెయిల్డ్ గా మాట్లాడేందుకు పొంగులేటి ప్రయత్నించారు. ఐనా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. దానితో బీఆర్ఎస్ నుంచి వైదొలగాలని పొంగులేటి నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ ఆలోచన తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఏ తుమ్మల కోసమైతే పొంగులేటిని కేసీఆర్ దూరం పెట్టారో..వాళ్లిద్దరూ ఒకటై ఇప్పుడు కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ పట్ల పొంగులేటి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో బాంబులు పేలతాయంటూ ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఆ డెడ్ లైన్ సమయానికి ఏమీ జరగకపోవడంతో త్వరలోనే ఆటం బాంబులు పేలతాయంటూ మరో ప్రకటన చేశారు. కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకు పోతారన్నట్లుగా పొంగులేటి సంకేతాలిచ్చారు. తప్పు చేయని వారికి ఏమీ కాదని, కానీ ప్రజల డబ్బును విదేశాలకు తరలించి తప్పు చేసినవారిపై మాత్రం ఆటం బాంబులు పేలుతాయని అన్నారు. అరెస్టులపై తానెవరి పేరుని కానీ, పార్టీ పేరును కానీ ప్రస్తావించుకున్నా ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ఐనా ఆయన కేటీఆర్ ను ఉద్దేశించే అంటున్నారని ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. తప్పు చేశామని అనుకుంటే ముందే సరెండరై కోర్టు విధించే శిక్ష అనుభవించాలన్నారు. కేటీఆర్​ పాదయాత్ర చేసినా మోకాళ్ల యాత్ర చేసినా తమకు అభ్యంతరం లేదంటూ మరీ మరీ ఎద్దేవా చేశారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ గట్టి కౌంటర్లు మొదలు పెట్టారు. పొంగులేటిని అన్ని వైపుల నుంచి ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు….అప్ డేట్స్ ఏమిటి అని ఈడీని కేటీఆర్ ప్రశ్నించడంలో ఏదో మతలబు ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఏదో జరగబోతోందని అనుమానిస్తున్నాయి……

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి