అరెస్టు కావడానికి కేటీఆర్ తొందరపడుతున్నారా ?

By KTV Telugu On 15 November, 2024
image

KTV TELUGU :-

రేవంత్ సర్కారు అధికారానికి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కలెక్టర్ సహా అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది. కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా.. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే పథకం ప్రకారం కేటీఆర్ ఆదేశాలతో దాడి చేసినట్లు నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో చెప్పారట. అయితే తాను అలాంటి వాగ్మూలం ఇవ్వలేదని, పోలీసులు తప్పుడు రిమాండ్ రిపోర్టు సృష్టించారని పట్నం ఆరోపణలు సంధిస్తున్నారు.

లగచర్ల ఘటన సహా.. రేవంత్ వర్సెస్ కేటీఆర్ రాజకీయంలో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. దాడికి సూత్రధారి సురేశ్ తమ పార్టీ వాడేనని కేటీఆర్ అంగీకరించడం కూడా దమ్ముంటే అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డిని సవాలు చేసినట్లేనని భావించాల్సి ఉంటుంది. రెండు రోజుల క్రితం కేటీఆర్ ను అరెస్టు చేస్తున్నట్లుగా అర్థరాత్రి ప్రచారం జరగడంతో పెద్ద దుమారమే రేగింది. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలంతా క్యూ కట్టారు. అయితే చివరికి అదీ ఒట్టి మాటే అయ్యింది. కేటీఆర్ పై చాలా అభియోగాలున్నాయని..ముందు అరెస్టు అయ్యేది ఆయనేనని తెలంగాణ సర్కారు లీకులు ఇవ్వడంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పెరిగింది. ఈ-ఫార్ములా కారు రేసు వ్యవహారంలో.. కేటీఆర్‌ను విచారించేందుకు.. రేవంత్ సర్కార్‌ గవర్నర్ అనుమతి కోరింది . దానిపై రాజ్ భవన్ నుంచి వర్తమానం రావాల్సి ఉండగా.. ఇప్పుడు లగచర్ల వ్యవహారంపై తెరపైకి వచ్చి కేటీఆర్ కు మరో శిరోభారం తప్పని పరిస్థితి ఏర్పడింది..

అరెస్టు ఖాయమన్న ప్రచారంపై కేటీఆర్ రోజుకు రెండు సార్లు స్పందిస్తున్నారు. తాను కుట్రదారుడ్ని కాదని రేవంతే ఆ పని చేస్తున్నారని విమర్శలు సంధిస్తున్నారు. ఎవరిది కుట్ర.. ఏంటి కుట్ర అంటూ రెచ్చిపోయిన కేటీఆర్‌.. ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా.. అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా.. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా.. ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర.. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అంటూ ప్రశ్నలు గుప్పించారు. కేటీఆర్ ట్విటర్ నిండా అరెస్టుకు సంబంధించిన కామెంట్సే కనిపిస్తున్నాయి.

ఏదోక రోజున తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ ఎదురుచూస్తున్నారు..తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానని.. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని.. చేసుకో అరెస్ట్ అంటూ రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. గత చరిత్ర చూస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిలో కసి పెరిగింది. అప్పటి నుంచి కష్టపడి ఆయన రాజకీయాల్లో రాణించారు.సీఎం అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై కసి తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తనను జైలుకు పంపిన వారిని ఊచలు లెక్కపెట్టించే పంతంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక పర్యాయాలు కేసీఆర్ , కేటీఆర్ ను జైలుకు పంపుతానని కూడా ఆయన చెప్పారు. ఎప్పుడో ఒక రోజున ఆ పని జరగాలని కేటీఆర్ కు తెలుసు.కసిగా ఉన్న రేవంత్ రెడ్డి గతాన్ని మరిచిపోతారని కూడా కేటీఆర్ అనుకోవడం లేదు. అందుకే పదే పదే అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. అరెస్టు చేస్తే ఒక పని అయిపోతుందని ఆయన భావిస్తున్న కారణంగానే అరెస్టు అయ్యేందుకు తొందర పడుతున్నారన్నది అనుచరుల సమాచారం. అరెస్టు ప్రక్రియ మొదలైతే బెయిల్ తెచ్చుకోవచ్చని, అప్పుడిక ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి