హైదరాబాద్‌పై నాటి KTv ఆలోచనే నేటి రేవంత్ మాస్టర్ ప్లాన్ !

By KTV Telugu On 20 February, 2024
image

KTV TELUGU :-

హైదరాబాద్ నగరం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోంది.  అయితే పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా సౌకర్యలు ప్రభుత్వాలు కల్పించగలుగుతున్నాయా ? నగరం విస్తరణ చేయకుండా రియల్ ఎస్టేట్ ను పెంచడం వల్ల ఎవరికి లాభం ?  ఉపాధి అవకాశాలు పెరగని నగరం  నిజమైన అభివృద్ధి ఎలా చెందుతుంది ?.  పెరుగుతున్న ఖర్చులతో పాటు ఆదాయం పెరగని నగరం వెనుకబడిపోతుందన్న అంశాలపై ఎన్నికలకు ముందు కేటీవీ వరుస కథనాలను ఇచ్చింది. మన నగరానికి ఏమైంది పేరుతో ఇచ్చిన కథనాలు ప్రజల్ని ఆలోచింప చేశాయి. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి.  KTv ఎత్తిచూపిన సమస్యలకు పరిష్కారంగా ఆయన మాస్టర్ ప్లాన్ ఆలోచనలు ఉన్నాయి.

హైదరాబాద్ నగరం మొత్తం దేశంలోనే ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్నంత వాతావరణ అనుకూలత మాత్రమే కాదు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన జీవనం దేశ వ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షిస్తోంది. అందుకే హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోతున్నాయి. ఇరవై ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ నగరం రెండింతలు పెరిగింది. మరి దానికి తగ్గట్లుగా సౌకర్యాలు పెరిగాయా…  వలస వస్తున్న వారికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయా.. అందరికీ ఉండేందుకు గూడు కల్పించేలా పరిస్థితులు కల్పిస్తున్నారా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. గత ప్రభుత్వం విధానాల విషయంలో ఇలాంటి విషయాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. అందుకే  ఈ నగరానికి ఏమైంది పేరుతో కేటీవీ ప్రత్యేకమైన కథనాలు ప్రసారం చేసింది.

కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా హైదరాబాద్ నగరంపై ఇలాంటి ఆందోళనలే ఉన్నాయి. ఇప్పుడు ఆయన వాటికి పరిష్కారం చూపే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి తన ఆలోచనలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేరిట మూడు భాగాలుగా విభజన చేసి, అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్లాని ఆయన నిర్ణయించుకున్నారు.   ఓఆర్ఆర్ కు చేరువలో పాతిక వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక వినూత్న సిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రణాళిక రచించుకున్నారు.  విజన్-2050  తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు.

గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగుతోంది. గత ప్రభుత్వం చేపట్టిన పనులు అని అడ్డగోలుగా వాటిని ఆపేయకుండా.. అభివృద్ధిని కొనసాగించారు. తెలంగాణ ప్రాంత నేతలు  తెలంగాణ  అభివృద్ధి విషయంలో  రాజకీయాల జోలికి పెద్దగా వెళ్లలేదు.  ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు రద్దు చేయలేదు. అందుకే  హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారింది.  రేవంత్ రెడ్డి కూడా అదే  బాటలో పయనిస్తున్నారు  హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే.. మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.  రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏ మాత్రం  బేషజాలకు పోవడం లేదు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్  ఇలా అందరి ఆలోచనలనూ గౌరవించి… ప్రస్తుత హైదరాబాద్ కు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డికి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయని అధికారం చేపట్టిన మొదట్లోనే స్పష్టమైంది. మురికి కాలువగా మారిన మూసీ నదిని ఆయన మాటలతో కాకుండా చేతలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసి నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని నిర్ణయించారు.  తొలి బడ్జెట్‌లోనే ఇందు కోసం వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ద్వారా మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా తీర్చిదిదదనున్నారు.  మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ సిటీ జనాభా దాదాపుగా కోటి మందికి చేరువ అవుతున్నారు. రాబోయే  రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉండనున్నాయి. వీటన్నింటినీ తట్టుకునేలా హైదరాబాద్ సిటీ వరల్డ్ క్లాస్ అయ్యేలా రూపొందించడానికి బహుముఖ వ్యూహంతో అడుగులు వేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ దిశగానే కదులుతున్నారని అనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి