సంతోష్‌కు నోటీసులు.. బీజేపీకి ఇరకాటమే!

By KTV Telugu On 24 November, 2022
image

సోమయాజి అంటే సో వాట్‌.. మరి సంతోష్‌!

ఫ్యామిలీని వదిలేసి ప్రపంచమే కుటుంబంగా బతుకుతున్న ప్రచారక్‌కి నోటీసులిస్తారా? ఏ పాపం తెలీని వ్యక్తిపై అభాండాలేస్తారా అంటూ బండి సంజయ్‌ భావోద్వేగం. ఆయన కళ్లలో చెమ్మకూడా కెమెరాల కంటికి చిక్కింది. ఏం బాబూ సంతోష్‌కి నోటీసులిస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావ్‌ అంటూ కేసీఆర్‌ కూతురి క్వశ్చనింగ్‌. అబ్బే కన్నీళ్లు కాదు పాడు కాదు కెమెరాల లైటింగ్‌ కళ్లలో పడి అన్యాపదేశంగా నీళ్లొచ్చాయని బీజేపీ నేతలు చెప్పొచ్చుగానీ..ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో బీఎల్‌ సంతోష్‌ పేరు చేర్చడంతో బీజేపీ గొంతులో పచ్చివెలక్కాయ పడింది.

బీఎల్‌ సంతోష్‌ సిట్‌ముందుకు వెళ్లకుండా చూసేందుకు సుప్రీంలో దిగ్గజ ప్లీడర్‌ రాంజెఠ్మలానీ రంగంలోకి దిగారు. గుజరాత్‌ ఎన్నికలు పూర్తయ్యేదాకా విచారణకు పిలవకుండా చూడాలన్నారు. అంటే అక్కడ చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయనేగా! అసలే ఆ సంతోష్‌ సాదాసీదా పర్సనాలిటీ కాదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అందుకే ఇంత ఉలికిపాటు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ని అంత తేలిగ్గా వదలదల్చుకోలేదు. ఎలాగైనా విచారణకు పిలిపించి కోర్టుని ఒప్పించి అరెస్ట్‌ చేయాలనుకుంటోంది. బీఎల్‌ సంతోష్‌‌కు మరోసారి సీఆర్పీసీ నోటీసులివ్వాలని తెలంగాణ హైకోర్టు సిట్‌ అధికారులను ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు సహకరిస్తారో లేదోనన్న అనుమానం లేకుండా వాట్సాప్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపాలని ధర్మాసనం సూచించింది.

మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్‌ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్‌, కేరళ డాక్టర్‌ జగ్గు స్వామి సిట్‌ విచారణకు మొహం చాటేశారు. ఈ ప్రలోభాల మూలాలు ఢిల్లీ నుంచి కేరళదాకా ఉన్నాయని సిట్‌ అనుమానిస్తోంది. అందుకే ఏ లింకునీ వదలడం లేదు. బీఎల్‌ సంతోష్‌ని విచారిస్తే చాలా విషయాలు బయటికొస్తాయనుకుంటోంది. జాతీయస్థాయిలో వన్‌, టూలకే కీలకమనుకుంటున్న సంతోష్‌ అంత సులభంగా విచారణకొస్తారా! అందుకే లీగల్‌గానే తమ రూట్‌ క్లియర్‌ చేసుకునే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. గట్టి కౌంటర్లు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన బీజేపీకి ఈ వ్యవహారం తల్నొప్పిగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో మూడోకంటికి తెలియకుండా పనులు చక్కబెట్టుకున్న కమలం పార్టీకి ఇది ఊహించని అనుభవం.
తెలంగాణలో ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో బీజేపీ పరువు పోయేలా ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మార్క్‌ రాజకీయం చూసినవారికి ఈ ప్రలోభాలు నిజమేనని అనిపిస్తోంది. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురిలో రామచంద్రభారతికి కేంద్రస్థాయిలో కొందరు ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అతని దగ్గర ఫేక్‌ ఆధార్‌, ఫేక్‌ పాస్‌పోర్టు దొరకటంతో వాటిమీద కూడా కొత్త కేసులు నమోదయ్యాయి. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసులో సాక్ష్యాలు చట్టంముందు నిలబడతాయా, అనుమానితులకు శిక్ష పడుతుందా లేదా అన్నది తర్వాత. అవునని ఒప్పుకోలేక, కాదని గట్టిగా ఖండించలేక బీజేపీ అయితే ఇరకాటంలో పడింది.

బీఎల్‌ సంతోష్‌కి నోటీసులు జారీ అయిన సమయంలోనే టీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డి ఇంటిమీద ఐటీ దాడులతో ఇది కక్షసాధింపేనన్న వాదనకు బలం చేకూరుతోంది. బీఎల్‌ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులకు కేంద్రంనుంచి ఇది కౌంటరన్న అనుమానాలు వస్తున్నాయి. బీఎల్‌ సంతోష్‌ బీజేపీలో కీలకమైన నాయకుడు. తెరవెనుక ఎన్నో పనులు చక్కబెట్టే ప్రముఖుడు. ఫాంహౌస్‌ కేసులో దొరికిన రామచంద్రభారతితో ఆయనకు పరిచయాలున్నాయి. వారిద్దరి మధ్య ఎన్నో కాల్స్‌ నడిచాయి. సిట్‌ నోటీసులిచ్చినప్పుడు ఆయన విచారణకు వచ్చుంటే గౌరవంగా ఉండేది. పైగా తమ అనుమతి లేనిదే అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. అలాంటప్పుడు భయపడాల్సిన పనేముందన్నదే ప్రశ్న. మరోవైపు ఫాంహౌస్‌ కేసులో అరెస్ట్‌ అయిన ముగ్గురికోసం బీజేపీ పోరాడుతుండటం ప్రచారాన్ని బలపరుస్తోంది. వారు కావాల్సినవారైతే నిర్దోషిత్వ నిరూపణకు పోరాడాలిగానీ అసలు విచారణే వద్దనటాన్ని ఏ విధంగా సమర్ధించుకోగలరు. అన్ని రాష్ట్రాల్లో అడ్డదారుల్లోనైనా బలపడాలనుకుంటున్న బీజేపీకి ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ బ్రేక్‌ వేస్తోంది.