ఢిల్లీలో సీసా మూత తీస్తే హైదరాబాద్ లో కంపు గుప్పుమంది

By KTV Telugu On 2 December, 2022
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూ హైదరాబాద్ లోని పాలక పక్షానికీ సంబంధం ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారాల పట్టి కవితను బిజెపి నేతలు ఎందుకు వెంటాడుతున్నారు?
ఏంటీ రాజకీయం? కవిత తో పాటు టి.ఆర్.ఎస్.నేతలు ఆరోపిస్తోన్నట్లు తెలంగాణాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.ను దెబ్బతీసేందుకే బిజెపి ఈడీ,సిబిఐ,ఐటీ అస్త్రాలను వాడేయాలని డిసైడ్ అయ్యిందా?
కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ టి.ఆర్.ఎస్. నాయకురాలు కవిత గురించి చేసిన వ్యాఖ్య వివాదం రాజేసింది.

కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఫోనులో మాట్లాడిందని అరవింద్ వ్యాఖ్యానించారు. అంతే ఆ మర్నాడే టి.ఆర్.ఎస్. కార్యకర్తలు అరవింద్ ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టించారు. కవిత అయితే మరో సారి ఇలాంటి తలా తోకా లేని మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతానని అరవింద్ పై తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇది రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసింది. అసలే ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలో బిజెపి టి.ఆర్.ఎస్.ల మధ్య దర్యాప్తు సంస్థల వార్ నడుస్తోంటే మధ్యలో కవితక్కపై అరవింద్ చేసిన వ్యాఖ్యల గొడవొకటి. బిజెపి ఎందుకని టి.ఆర్.ఎస్. పై ఇలా స్పీడ్ పెంచింది? ఏంటీ దూకుడు? బిజెపి-టి.ఆర్.ఎస్.ల మధ్య పచ్చగడ్డి కాదు మంచు గడ్డ వేసినా భగ్గుమనడానికి కారణాలేంటి? దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని రాజకీయ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి.

తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చావు దెబ్బ తీసేందుకే టి.ఆర్.ఎస్.-బిజెపిలు చీకట్లో చేతులు కలిపి డ్రామాలాడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కచ్చితంగా ఎంతో కొంత వాస్తవం ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. కు గట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్సే. ఎనిమిదేళ్ల గులాబీ బాస్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ తో పోలిస్తే బిజెపికి తెలంగాణా లో గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ క్యాడర్ లేదనేది వాస్తవం.
ప్రతీ గ్రామంలోనూ బలమైన క్యాడర్ ఉన్నది కాంగ్రెస్ కే. అందుకే కాంగ్రెస్ తమకి పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని టి.ఆర్.ఎస్. భావిస్తోంది.

అసలు తెలంగాణాలో టి.ఆర్.ఎస్. బిజెపిలు తప్ప ఇంకే పార్టీలూ లేనట్లు రోజూ పొద్దున్న లేస్తే టి.ఆర్.ఎస్.-బిజెపిల మధ్య మాటల యుద్దాలు నడుస్తున్నాయి. ఈ రొంపిలోకి ఏకంగా బిజెపి మాజీ నాయకురాలైన తెలంగాణ గవర్నర్ తమిళిసైనీ లాగారు. అయితే ఇది నిజంగా బిజెపి-టి.ఆర్.ఎస్.ల మధ్య యుద్ధం కానే కాదంటున్నారు కాంగ్రెస్ వర్గీయులు. రోజూ పత్రికల్లో టి.ఆర్.ఎస్.-బిజెపిల పేర్లు మాత్రమే కనిపిస్తూ ఉంటే కొంత కాలానికి జనం కూడా టి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయంగా బిజెపిని గుర్తిస్తారని ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలుతుందని అది కాంగ్రెస్ పుట్టి ముంచుతుందని అంటున్నారు. ఒక వైపు బిజెపిని మరో వైపు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయ వై.ఎస్.షర్మిల పార్టీని కూడా టి.ఆర్.ఎస్. పావుగా వాడుకుంటోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణాలో ఇప్పటికీ వై.ఎస్.ఆర్.కు చెప్పుకోదగ్గ అభిమానులు ఉన్నారు. ఆ ఓట్లు సహజంగానే కాంగ్రెస్ కు పడతాయి. అదే షర్మిలను రంగంలోకి దించితే ఆఓట్లు కచ్చితంగా కాంగ్రెస్ కు దూరమై షర్మిల పార్టీకి పడతాయి. దాని వల్ల షర్మిల ఒకటి రెండు సీట్లు గెలుచుకుంటుందన్న గ్యారంటీ కూడా లేకపోయినా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టడానికి మాత్రం ఆమె పనికొస్తారని భావిస్తున్నారు. ఒక వైపు షర్మిల పార్టీ, మరో వైపు బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెరో కొంత చీలిస్తే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. వ్యతిరేక ఓటు చీలడంతో కేసీయార్ పార్టీ సునాయసంగా విజయాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో మూడో సారి అధికారంలోకి వస్తుందన్నది వారి వ్యూహంగా చెబుతున్నారు. ఫాం హౌస్ లో పురుడు పోసుకున్న ఈ వ్యూహం కొద్ది నెలలుగా పకడ్బందీగానే అమలవుతోందంటున్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను మరింతగా బలహీన పర్చాలంటే షర్మిల పార్టీ,బిజెపిలను కొంత బలోపేతం చేయాలి.

అందుకోసమే ఒక వైపు బండి సంజయ్ యాత్రను ఆపిన గులాబీ పార్టీ మరో వైపు షర్మిల పాదయాత్ర నూ అడ్డుకుని ఆమె కాన్వాయ్ పై దాడులకు తెగబడింది. 3500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన షర్మిలకు యాత్రతో రాని పబ్లిసిటీ మొన్న ఒక్కరోజు ఆమె కాన్వాయ్ పై దాడి ఆ తర్వాత ధ్వంసమైన కారుతో ఆమెప్రగతి భవన్ కు ర్యాలీగా వెళ్తోంటే పోలీసులు అడ్డుకుని క్రేన్ సాయంతో ఆమెను కారులో ఉండగానే పోలీస్ స్టేషన్ కు తరలించిన ఘటనతో షర్మిల పార్టీకి ఎక్కడ లేని ప్రచారమూ వచ్చిపడిందంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడ ఓట్ల చీలిక కోసం వాడుకోవడమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత మూటకట్టుకున్న టి.ఆర్.ఎస్. పట్ల సానుభూతి పెంచడానికే కవిత పేరును లిక్కర్ స్కామ్ లో ఇరికించి ఈడీ దాడులు చేస్తోన్నట్లు చేసి బిజెపి అన్యాయంగా టి.ఆర్.ఎస్. ను వేధిస్తోందన్న భావన కలిగేలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఇదంతా కూడా బిజెపి అగ్రనేతలు కేసీఆర్ లు ఢిల్లీలో రూపొందించుకున్న ప్రణాళికలో భాగమే అంటున్నారు వారు. అయితే ఊహాగానాలను నమ్మలేం. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేం. నిజాల నిగ్గు తేలితేనే కానీ ఎవరేంటో ఎలా చెప్పగలం? అంచేత లిక్కర్ స్కామ్ లో కవిత పేరు అనేది రాజకీయ వ్యూహంలో మేలిమి అస్త్రమేఅని హస్తిన కోళ్లు హిందీలో కూస్తున్నాయి.