జాబితాలు సిద్ధం.. కొట్లాటలతో భయం

By KTV Telugu On 19 August, 2023
image

KTV Telugu ;-

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది రేపే పోలింగ్ అన్నట్లుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాపై మల్లగుల్లాలు పడుతున్నాయి. దాదాపుగా అభ్యర్థులు ఖరారైనట్లేనని ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. కాకపోతే ఒక టికెట్ కు వంద మంది ఆశావహులు ఉండటంతో గొడవలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండటంతో అధినాయకత్వం తలపట్టుకు కూర్చుంటోంది. ఈ విషయంలో పాపం బీజేపీ బాగా వెనుకబడిపోయిందనే చెప్పాలి…

మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే మేము సహకరించేది లేదు. వీలైతే మేము ఆయన్ను ఓడించి చూపిస్తాం. ఈ సారి మాకు లేదా మా అనుచరులకు టికెట్లు ఇవ్వాల్సిందే. లేకపోతే పార్టీ పరిస్థితి అధోగతే.. ఇదీ ఇప్పుడు తాజా ట్రెండ్. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరుకు జరిగినా, కాస్త ముందుకు జరిపినా నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వాళ్లకే ఎందుకు ఈ సారి మాకు ఇవ్వొచ్చు కదా…. అని అధికార పార్టీలో 50 నుంచి 60 నియోజకవర్గాల్లో గొడవలు తారా స్థాయికి చేరాయి.. మీటింగులు పెట్టి, మీడియాను పిలిచి మరీ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. పార్టీ పరువును బజారుకీడ్చుతుంటే అధినాయకత్వం బిత్తర చూపులు చూస్తోంది.

కార్యకర్తల హడావుడి, నేతల హడావుడి, పార్టీల హడావుడి, వెరసి ఎన్నికల హడావుడి. అదిగో ద్వారక అంటే ఇవిగో ఆలమందలు అన్నట్లుగా హడావుడి. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు ఎన్నికల జ్వరం పుట్టించిన హడావుడే ఇది. వచ్చే వారమే… వీలైతే రేపే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నంతగా హడావుడి కొనసాగుతోంది. నిజానికి 2018లో జరిగిన ఎన్నికల సమయానికి ఓ నాలుగైదు రోజులు అటూ ఇటూగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పట్లో అక్టోబర్ ఆరో తేదీన షెడ్యూల్ ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. ఆ ప్రకారం చూస్తే ఇంకా పోలింగ్ కు మూడు నెలల గడువు ఉంది. షెడ్యూల్ రావడానికి ఇంకా రెండు నెలల గడువు ఉంది. కానీ రాజకీయ పార్టీలు మరో వారంలో నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నట్లుగా హడావుడి పడుతున్నాయి.

పరస్పరం పోటీ వల్లే పార్టీల్లో హడావుడి కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ ఆమోదించిన తొలి జాబితా ఇప్పుడు కేటీఆర్ చేతుల్లో ఉందని అంటున్నారు. కేసీఆర్ కు 6 సంఖ్య లక్కీ అని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. అందుకే తొలి జాబితాగా 66 నుంచి 105 వరకు ఎంత మంది అభ్యర్థుల పేర్లయినా ప్రకటించే వీలుందని అంటున్నారు. దీనితో ఇప్పుడు నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి మొదలైంది.

స్టేషన్ ఘన్ పూర్, జనగామ, మంథనీ.. నియోజకవర్గం ఏదైనా సరే… బీఆర్ఎస్లో సమస్యలు తప్పడం లేదు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వర్గం లొల్లి పెడుతోంది. వైరి వర్గాలు మీటింగులు పెట్టి మరీ ప్రకటనలు ఇస్తున్నాయి. ముత్తిరెడ్డి ప్రత్యర్థి వర్గంలో మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముత్తిరెడ్డి ఓడిపోతారని సర్వేలో తేలడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మంథనిలో పుట్టా మధుకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని కొందరు ఉద్యమమే మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పాలమూరు నేత చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని మీటింగుకు వచ్చి మరీ రెబెల్స్ గొడవ చేశారు. దానితో ఇరువర్గాలు కొట్టుకుని చొక్కాలు చినిగాయి.

బీజేపీ పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి బండి సంజయ్ టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాస్త ఊపు కనిపించేది. ఆయన ప్రకటనలతో పార్టీలో జోష్ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే టీబీజేపీని చూస్తున్నారు. ధర్నాలు, నిరసనల కోసం వేసిన కమిటీలు పనిచేస్తున్నాయో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ హడావుడి పడిపోతుంటే బీజేపీ నింపాదిగా నిద్రపోతోందన్న ఫీలింగ్ కలుగుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి