మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా సాగుతుంది.గెలుపే ద్యేయంగా అభ్యర్దులు తమ ప్రచారాన్ని ఉదృతం చేశారు.ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.ఇక్కడ 15 మంది అభ్యర్దులు పోటీ పడుతున్నా ప్రధానంగా త్రిముఖపోటీ జరుగుతుంది.అధికార బీఆర్ఎస్కు దీటుగా ఇటు బీజేపీ,అటు కాంగ్రేస్లు తమ సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి.చేసిన అభివృద్ది..తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కే జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది.పాతసీటును నిలుపుకునేందుకు కాంగ్రేస్ చూస్తుంటే బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది.
మహబూబ్‌నగర్ నుంచి గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజయం సాధించారు.మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఇక గడచిన మూడున్నర దశాబ్దాల నుంచి ఇక్కడ కాంగ్రేస్ పార్టీ తరపున అభ్యర్ది గెలువకపోవటంతో ఈసారి తప్పక విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.బీజేపీ కూడ సత్తాచాటాలని చూస్తోంది.కాంగ్రేస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు ఏపీ మిథున్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.వీరితోపాటు 15 మంది బరిలో ఉన్నారు.నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 43 వేల 689 మంది ఓటర్లు ఉన్నారు.
మహబూబ్‌నగర్ టౌన్‌తోపాటు రూరల్ మండలం,హన్వాడ మండలాలు మాత్రమే ఉన్నాయి.ప్రధానంగా ముస్లీం మైనార్టీలు,ముదిరాజ్ఓట్లు ఇక్కడ ప్రభావం చూపనున్నాయి.ఎక్కువ మంది ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండి రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ఓట్లు కూడ చాలానే ఉన్నాయి.మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్ గడచిన తొమ్మిదిన్నర ఏళ్లుగా తాను చేసి అభివృద్ది వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను,సంక్షేమ పథకాలను తెలియ జేస్తూ భవిష్యత్ తాము అధికారంలోకి వస్తే ఏం మేలు చేస్తామో అనే అంశాన్ని జనాలకు చెబుతున్నారు.కులసంఘాలు,మహిళాల సంఘాలు మేధావులను కలుస్తు ఓటు వేయాలని విన్నవిస్తున్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్,మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తోపాటు మైనార్టీ సామాజికి వర్గానికి చెందిన నాయకుడు ఇబ్రహీం సైతం బీఆర్ఎస్ లో చేరి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాటు ప్రచారంలో పాల్గొంటుండటం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.మంత్రి అనుచరుడు ఉమ్మడి జిల్లా గౌడసంఘం అధ్యక్షుడు,కౌన్సిలర్ ఆనంద్‌కుమార్ బీఆర్ఎస్ను వీడటం,ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మంత్రికి మైనస్‌గా మారే అవకాశం ఉంది.తమ అభివృద్ది,పార్టీ విధానాలు చెప్పటంతోపాటు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.మూడోసారి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.సైలెంటుగా సాగుతున్నారు.కాంగ్రేస్ పార్టీ ఆరుగ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూనే ఏడో గ్యారెంటీగా ఇక్కడి ప్రజలు స్వేచ్చగా తమ బతుకులు బతికేందుకు,దైర్యంగా వ్యాపారాలు చేసుకునేందుకు భరోసా ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అందుకే మార్పుకోరుకుంటున్నారని యెన్నం అంటున్నారు.డబుల్బెడ్రూం ఇళ్లు,రేషన్‌కార్డులు,ధరణి తదితర సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.ముస్లీం మైనార్టీలు,బీసీలు,మేధావులు,నిరుద్యోగులు,మహిళలు తమవైపు ఉన్నారని చెబుతున్నారు.
బిజెపి అభ్యర్ధి మిథున్ రెడ్డి కేంద్రం ఇచ్చిన నిధులతో మాత్రమే జిల్లా కేంద్రంలో అభివృద్ది జరుగుతుంది తప్ప రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పాపన పోలేదని మండిపడుతున్నారు.డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ది సాధ్యమవుతుందని పిలుపు నిస్తున్నారు.గెలుపుపై బీజేపీ సైతం ధీమాగా ఉంది.అయితే ఎవరి ప్రచారాలు..ఆర్బాటాలు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం అన్ని నిశితంగా గమనిస్తున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది అన్ని పార్టీలు మాత్రం గల్లీగల్లీలో ప్రచార రథాలతో హోరెత్తిస్తున్నారు.మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…