ఈడీకి లేఖ రాసిన ఐటీ అధికారులు
త్వరలో రంగంలోకి దిగనున్న ఈడీ
టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మొదలైన రాజకీయ వైరం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంటా అన్నట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒకవైపు సిట్, మరోవైపు ఐటీ దాడులతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. మరోవైపు ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో నాటకీయ పరిణామాలకు దారితీసింది. దాదాపు 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మంత్రి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
రూ.18.50 కోట్ల నగదు, 15 కిలోల బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, ప్రవీణ్ కుమార్ ఇంట్లో రూ.2.5 కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో రూ.కోటి సీజ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రూ.3 కోట్లు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో రూ.6 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని లాకర్స్‌ను ఐటీ అధికారులు తెరవాల్సి ఉంది. వీటిని తెరిస్తే ఇంకెంత నగదు, బంగారం బయటపడుతుందో తెలియదు. పట్టుబడిన నగదు అంతా కాలేజీల అడ్మిషన్లు పూర్తి కావడంతో వచ్చిన సొమ్ముగా చెబుతున్నారు.
కాలేజీల్లో విద్యార్థుల నుంచి గత మూడేళ్లుగా రూ.135 కోట్లు డొనేషన్ల రూపంలో వసూలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాలేజీల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కాకుండా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు బయటపడినట్లు చెబుతున్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఈ నెల 28,29వ తేదీలలో విచారణకు రావాలని మల్లారెడ్డితో పాటు కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులందరికీ ఐటీ సమన్లు జారీ చేసింది. అయితే ఇది ఇక్కడితో పోయేలా లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాయనున్నారు. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అవకతవకల గుట్టు రాబట్టడానికి ఈడీ విచారణ జరగాలని ఐటీ భావిస్తోంది. ఈడీ గనక రంగంలోకి దిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింతగా బిగుసుకున్నట్టేనని అంటున్నారు. త్వరలో ఈడీ అధికారులు కూడా మల్లారెడ్డి ఇంటి తలుపు తట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.