మల్లారెడ్డి ఇంట్లో మాయమై పోలీస్టేషన్ వద్ద కనిపించిన ల్యాప్‌టాప్
అది ఎవరిదో తేల్చడానికి జంకుతున్న పోలీసులు
అసలు కేసులతోనే పోలీసులు సతమతం అవుతుంటే కొసరు కేసులు వారి దుంప తెంచుతున్నాయి. ఉన్నట్టుండి తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగిపోయింది. కంప్లయింట్లు, కేసులు, విచారణలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన తనిఖీల సందర్భంగా మల్లారెడ్డి ఇంటివద్ద పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకున్నారు.
తన కుమారుడిని ఐటీ అధికారులు వేధించారని బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మల్లారెడ్డి తన ల్యాప్‌టాప్‌ను మాయం చేశారని ఒక ఐటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ల్యాప్‌టాప్ విషయమై పోలీసులు ఎంక్వైరీ మొదలెట్టగానే మల్లారెడ్డి అనుచరులు ఒక ల్యాప్‌టాప్ తెచ్చి ఇచ్చారు. అది తనది కాదని సదరు ఐటి అధికారి స్పష్టం చేశారు. కాసేపటికి మరో అనుచరుడు బైక్ మీద వచ్చి పోలీస్టేషన్ గేటు వద్ద ఒక ట్యాప్‌టాప్ పెట్టేసి వెళ్లిపోయాడు. అది కూడా తనది కాదు అన్నారు ఆ అధికారి. దీంతో ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకున్నారు పోలీసులు. వారం రోజులుగా ఆ ల్యాప్‌టాప్ పోలీస్టేషన్‌లోనే ఉంది. కోర్టు అనుమతి లేకుండా దాన్ని ఓపెన్ చేయడానికి జంకుతున్నారు. అలాగని ఆ ల్యాప్‌టాప్‌ను తదుపని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయని వెనకడుగు వేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న ల్యాప్‌టాప్ తీసుకొచ్చిన యువకుడిని అక్కడున్నవారు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. అతను ఎవరనేది ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. కానీ దర్యాప్తులో ఆ యువకుడు మంత్రి అనుచరుడు అని మంత్రి ఇంటివద్ద నుంచే వచ్చాడని తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఒకవేళ అతను మంత్రి అనుచరుడే అని తేలితే ఐటీ అధికారి ఇచ్చిన కంప్లయింట్‌కు వేరే ఆధారాలు అవసరం లేదు. ఫోరెన్సిక్ పరీక్షలో అది ఐటీ అధికారిదే అని తేలితే అది యువకుడి చేతికి ఎలా వెళ్లింది అతినికి ఎవరు ఇచ్చారు తేల్చాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఐటీ అధికారిది కాదని తేలితే మరి ఆ ల్యాప్‌టాప్ ఎక్కడుందో కనుక్కోవాల్సింది కూడా పోలీసులే. ఏ కోణంలో దర్యాప్తు చేసినా అటుతిరిగి ఇటుతిరిగి మంత్రి మల్లారెడ్డి లేదంటే ఆయన అనుచరుల మెడకే చుట్టుకునే అవకాశం ఉండడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన‌్నట్లుగా ఉంది పోలీసులు పరిస్థితి.