కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మూమెంటం ఉంది. ఆ విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ కూడా అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందని ప్రచారం చేసేస్తున్నారని బండి సంజయ్ ఓపెన్ గా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయవద్దని ఊరూవాడా తిరిగి బీఆర్ఎస్ అగ్రనేతలంతా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ మూమెంటం ఎలా వచ్చింది ? నిజానికి 2018 తర్వాత కాంగ్రెస్ బలహీనపడింది. ఉపఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. గ్రేటర్ ఎన్నికల్లో రెండు సీట్లలోనూ గెలవలేదు. కానీ ఇప్పుడు .. కాంగ్రెస్ వస్తుందని చెప్పుకునే స్థితికి వచ్చింది. దీనికి కారణం ఒక్కటే. రేపు ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయన్న సంగతిని పక్కన పెడితే.. కాంగ్రెస్ ఊపునకు కారణం ఒక్కటే. ఆ కారణం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి అతడే ఒక సైన్యం అన్నట్లుగా మారారు రేవంత్ రెడ్డి. రోజుకు నాలుగైదు నియోజకవర్గాలు చుట్టబెడుతున్నారు. మధ్యలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. పార్టీ అగ్రనేతలు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. పార్టీలో చేరడానికి వచ్చే వాళ్లతో సమావేశం అవుతున్నారు. మీడియా ఇంటర్యూలు ఇస్తున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ తరపున చేస్తున్న పనులన్నింటినీ .. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్‌లో మరే నేత.. తమ పక్క నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకే ఒక్కడు అన్నట్లుగా పోరాడుతున్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి తేడా రేవంత్ రెడ్డినే.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలేమిటన్నదానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని ప్రజలు నమ్మడమేనని ఎక్కువ మంది చెప్పుకుంటారు. కాంగ్రెస్ నేతలూ అదే ప్రచారం చేసుకుంటారు. తెచ్చింది కేసీఆర్ అయితే.. ఇచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు ఎందుకు ఆదరించలేదు. ఈ ప్రశ్నకు చాలా మందికి ఆన్సర్ తెలిసినా చెప్పరు. తెలియని వాళ్లూ ఎక్కువగానే ఉంటారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించకపోవడానికి కారణం నాయకత్వ లోపం. అవతలి వైపు కేసీఆర్ బాహుబలిలా నిలబడ్డారు. మరి కేసీఆర్ ను ఢీకొట్టే నేత ఎవరు ?. ఈ డైలమాలో ప్రజలు ఉండబట్టే ప్రజలు చాన్సివ్వలేదు. అంటే.. అసలు కారణం నాయకత్వం. గొప్ప టీమ్ ఉంటే సరిపోదు అందర్నీ ఏకతాటిపై నడిపించే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ప్రజల్లో పరపతి ఉండాలి. ప్రత్యర్థికి ధీటైన నాయకుడు అనిపించాలి. ప్రత్యామ్నాయం తానే అనిపించగలగాలి. అలాంటి నాయకుడు లేక.. బహునాయకత్వం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. 2014లో కానీ… 2018లో కానీ కాంగ్రెస్ తరపున ప్రచారాన్నిభుజాన వేసుకుని నడిపించిన నాయుకుడు లేకపోవడం వల్లనే ఓడిపోయింది. చివరిలో రేవంత్ రెడ్డికి కాస్త ప్రాధాన్యం ఇచ్చినా .. అప్పటి వరకూ ఆయనను పక్కన పెట్టడం వల్ల ప్రజలు నమ్మలేదు. మరి ఇప్పుడు మన కళ్ల ముందు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ అదే తేడా.
తెలంగాణలో సీనియర్ నాయకులు కొదువలేదు. కానీ వారంతా సొంత నియోజకవర్గాల్లో గెలవడానికే ఎంతో కష్టపడాలి. కసరత్తులు చేయాలి. కాంగ్రెస్ లో ఉన్న అతి పెద్ద సమస్య సీనియర్ నేతలు ఎవరూ ప్రజల్లో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేయరు. తమ పలుకుబడిని కేవలం హైకమాండ్ వద్ద పెంచుకుంటారు కానీ సొంత నియోజకవర్గంలో కాదు. కానీ వాళ్లు హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని పార్టీని ఆడించాలనుకుంటారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమ వర్గం అంటూ చాలా మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు కానీ.. వారి బాధ్యతలు తీసుకోవడానికి చాలా మంది వెనుకడగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా తామేనని ఓ నాయకుడు ప్రజల ముందు నిరూపించుకోలేకపోయారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ఇదే కారణం. ఇప్పుడు ఎన్నికల్లో ఏం జరుగుతుందో కళ్ల ముందు కనిపిస్తోంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి నలుగురు రాష్ట్రాన్ని నాలుగు వైపు నుంచి కమ్మేస్తూంటే.. అందరికీ ఒక్కడై సమాధానం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. స్వయంగా కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీ చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదే కామారెడ్డి సెగ్మెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిహేను వేల మెజార్టీ వచ్చింది. రేవంత్ నిలబడతాడని తెలియక కేసీఆర్ అంచనా వేసి ఉండరు. పీసీసీ పదవి ఉంటే సరిపోదు. ప్రజలు కూడా కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా గుర్తించాలి. అప్పుడే పోటీ ఉంటుంది. అలాంటి పోటీ ఇప్పుడు తెలంగాణలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గుజరాత్ లో బీజేపీ ఎందుకు వరుసగా గెలుస్తూ వస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున మోదీని ఢీకొట్టగలిగే లీడర్ లేడు. మోడీ ఢిల్లీకి వచ్చినా ప్రతీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కటౌట్ నే ఉపయోగించుకుంటారు. తానే సీఎం అన్నట్లుగా పర్యటిస్తూ .. ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయనకు ధీటుగా గుజరాత్లో మరో నేత కాంగ్రెస్ నుంచి ఎదగలేదు. ఫలితంగా అక్కడ బీజేపీనే తప్పనిసరిగా ఆదరిస్తున్నారు ప్రజలు. తెలంగాణలో గత రెండు సార్లు అదే జరిగింది. కాంగ్రెస్ సీనియర్లు తాము సీఎం స్థాయి నేతలమని.. తమ పార్టీలో వాళ్లతో పోల్చుకుంటారు. తమ కంటే సీనియర్లు ఎవరున్నారని అంటారు. కానీ ప్రత్యర్థితో మాత్రం పోల్చుకోరు. కేసీఆర్‌తో పోల్చుకునే సాహసం అసలు చేయరు. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది సీనియర్లు తమ పట్టు ఉందని నిరూపించుకునేందుకు తమకు దగ్గర అనుకున్న వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడం సహజం. ఈ సారి కూడా అలాగే జరిగింది ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో టిక్కెట్ల పంపకం పూర్తిగా ఈగోల మీద జరిగింది. తుంగతుర్తి, సూర్యాపేట, మనుగోడు వంటి చోట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు కావాల్సిన వారికి సీట్లు ఇప్పించుకున్నారు. ఖమ్మంలోనూ కొంత మంది నేతలుఅంతే. అయితే ఈ నేతలంతా తమ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టగలరు. ఎందుకంటే అలా పెట్టగలిగితేనే గట్టిపోటీ ఇవ్వగలుగుతారు. తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారు తమ పాట్లు తాముపడాల్సిందే.
రేవంత్ రెడ్డి మాత్రం భిన్నం. అందరికోసం రేవంత్ రెడ్డే ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేయాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. రెండు రోజుల ముందు బ హిరంగ సభ ప్లాన్ చేసినా జనం వెల్లువలా వస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఈ జన నినాదం సాక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ పై భరోసా కలిగేలా చేయడానికి రాహుల్, ప్రియాంక గాంధీలు ఎక్కవ రోజులు తెలంగాణలో ప్రచారం చేసేలా ఒప్పించగలిగారు. రేవంత్ రెడ్డి వ్యూహాలపై.. పార్టీపై ఉన్న నిబద్ధతపై హైకమాండ్‌కు ఎంతో నమ్మకం ఉంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రతీ విషయంలోనూ రేవంత్ కు సపోర్ట్ చేస్తూ వస్తోంది. రేవంత్ అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు తాను ఓ మెట్టు దిగడానికి కూడా వెనుకాడనని చెప్పడమే కాదు చేసి చూపించారు. పార్టీని నష్టపరిచిన కొంత మంది క్షమాపణ చెప్పమన్నా చెప్పారు. పార్టీ బలోపేతం కోసం రేవంత్ దేనికైనా సిద్ధపడటం హైకమాండ్ దగ్గర పలుకుబడి పెంచేలా చేసింది.
ఆటలో అయినా రాజకీయాల్లో అయినా గెలుపోటములు తేడా కొంతే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో 60 సీట్లు తెచ్చుకుంటే గెలుపు. 59 దగ్గర ఆగినా పరాజయమే. ఆ ఒక్కటే విజయాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి డిఫరెన్స్ వచ్చేది సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడే. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఇద్దరు సమర్థులైన నేతల మధ్య పోరాటం జరుగుతోంది. ఎవరిది పైచేయి అనేది డిసెంబర్ మూడో తేదీన తేలుతుంది.
రేవంత్ రెడ్డి ధీటైన నాయకుడిగా ఎదిగారు. కానీ కేసీఆర్ అంత కాదు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తే.. ఆయన ఖచ్చితంగా కేసీఆర్ కు సమఉజ్జీ అవుతారు. అందులో సందేహం ఉండదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…