మంత్రి పదవుల లొల్లి

By KTV Telugu On 11 July, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే కంటే.. ఏ జిల్లాకు మంత్రి పదవి వస్తుందన్న చర్చకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. ఒక్క  మంత్రి  పదవి  కూడా లేని జిల్లాల కంటే మంత్రులున్న జిల్లాలోనే నేతలు ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. విస్తరణ జరిగితే తమ జిల్లాకు ఇంకెన్ని  పదవులు  వస్తాయోనని లెక్కలేసుకుంటున్నారు. అలాంటి జిల్లాలో నల్గగొండ ఒకటి. చాలా మంది ఎమ్మెల్యేలు  మంత్రి పదవులు ఆశిస్తూ హైదరాబాద్లో కర్ఛిఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న పదవులు తక్కువే అయినా జిల్లాకు ఇద్దరు ముగ్గురు బలమైన ఆశావహులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు….

తెలంగాణ కేబినెట్లో ఆరు బెర్తులే ఖాళీగా ఉన్నాయి. విస్తరణ జరిగితే  ఆరుగురికి మాత్రమే అవకాశం వస్తుంది. ఇప్పుడున్న వారిలో ఒక్కరిద్దరినీ పక్కకు తప్పిస్తే మినహా అదే ఫైనల్ ఫిగర్ అవుతుంది. ఆ ఆరు పదవుల కోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు నలుగురైదుగురు ఆశావహులు రెడీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ప్రతీ ఎమ్మెల్యే  మంత్రి పదవిని ఆశిస్తున్నారు.  నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సూర్యాపేట జిల్లా నుండి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కీలకమైన రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు, మంత్రి  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి నీటి పారుదల, సివిల్‌ సప్లై శాఖలు కేటాయించారు. అతి త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనుండడంతో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు  మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి పేరు

వినిపిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపాలనే లక్ష్యంతో మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు. ఆ సమయంలోనే అధిష్టానం రాజ్‌ గోపాల్‌ రెడ్డికి అభయం ఇచ్చారు.

ఓడిపోతానని తెలిసి కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చారు. ఓడిపోయిన తర్వాత వ్యూహాత్మకంగా  వ్యవహరిస్తూ కాంగ్రెస్ లో చేరిన ఆయన గెలిచి  మరీ చూపించారు. ప్రభంజనాన్ని అర్థం చేసుకున్న నేతగా ఆయనకు పేరు ఉంది. రాజ్ గోపాల్ మాదిరిగానే నల్లగొండ  జిల్లాలో చాలా మంది ఆశావహులున్నారు..

త్వరలోనే తనకు కీలకమైన పదవి  రాబోతోందని రాజ్ గోపాల్ స్వయంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అందుకోసమే ఎంపీ ఎన్నికల్లోనూ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఇంచార్జ్‌ గా ఉండి అధిష్టానం పెట్టిన బాధ్యతను నిర్వర్తించి ఎంపీగా చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిని గెలపించారు. కోమటిరెడ్డి సోదరులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల దమ్ము ఉంది. మూడు జిల్లాల ఉమ్మడి నల్గొండలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుండి మంత్రులు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం కొంత భాగం

ఉన్నందున యాదాద్రి జిల్లా నుండి కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయం అని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారట. ఇప్పటికే అదిష్టానం సైతం రాజ్‌ గోపాల్‌ రెడ్డి పట్ల అనుకూలంగా ఉండడం వల్ల మంత్రి పదవికి లైన్‌ క్లియర్‌ అయినట్టేనన్న టాక్‌ వినిపిస్తోంది. దేవరకొండ నియోజకవర్గం నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేనావత్‌ బాలు నాయక్‌ కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి క్యాబినెట్‌ లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేక పోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్‌ కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తోంది.ఇక ఆలేరు నుండి మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బీర్ల ఐలయ్యకు మొదట్లోనే ప్రభుత్వ విప్‌ పదవి దక్కింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.  యాదాద్రి జిల్లాకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్పీగా ఎన్నికైన తీన్మార్‌ మల్లన్న కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గద్దె దిగడానికి మల్లన్న అందించిన సహాకారం ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు..

కేబినెట్ విస్తరణ దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఆశావహులు పెరుగుతున్నారు. ఒక్క  నల్లగొండలో మాత్రమే కాకుండా అన్ని  ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రతీ చోటు నలుగురైదుగురు ఆశావహులున్నారు.ఎవరికి  మంత్రి పదవి దక్కుతుందో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి