తెలంగాణ వైద్యవిద్యలో కొత్త అధ్యాయం. మరో 8మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం
కేసీఆర్ పాలనలో 8 ఏండ్లలోనే 12 కళాశాలలు. సాకారం కానున్న జిల్లాకో మెడికల్ కాలేజీ కల
మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. అందరికీ ఆరోగ్యం అందుబాటులో వైద్యవిద్య అనే సూత్రాన్ని అక్షరాల పాటిస్తూ ముందుకెళ్తోంది. తెలంగాణలో వైద్యవిద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే ఏడాదిలో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్లో తరగతులను వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమైనట్లు అయింది. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైద్యవిద్య కళాశాలల సంఖ్య 17కి చేరింది.
మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు కేసీఆర్. గతంలోనే మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో నాలుగు మెడికల్ ప్రారంభించారు. మరో 8 కాలేజీల్లో తరగతులు ప్రారంభించి నూతన అధ్యాయం నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయమని కేసీఆర్ కొనియాడారు. దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 17 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేందుకు విశేష కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. పెరిగిన కాలేజీలకనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య 2,790కు పెరిగింది. పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. రాష్ట్రానికి వైద్య కవచం నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే ఉండేవి. గాంధీ, ఉస్మానియాతో పాటు వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లో రిమ్స్, నిజామాబాద్‌లో మరో వైద్య కళాశాలను ఏర్పాటుచేశారు. ఐదు కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే ఉండేవి. మెడిసిన్ చదువాలనుకున్న ఎంతోమంది విద్యార్థులు తమ కలలకు దూరమయ్యేవారు. ఇక వైద్యవిద్య కోసం ఎంతోమంది అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన పరిస్థితులు చూశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు వచ్చాయి. అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ధృడనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదంటున్నారు వైద్యనిపుణులు. వచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది.