కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో మరోసారి శబ్దాలు, ప్రకంపనలు రావడం కలకలం సృష్టించింది. మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటు పైకి ఎత్తడానికి అధికారులు ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. వెంటనే పనులు నిలిపివేసిన నీటిపారుదల శాఖ.. మరమ్మతులపై సూచనల కోసం కమిటీని ఏర్పాటు చేసింది.
గోదావరికి భారీగా వరద వచ్చిన సమయంలో మేడిగడ్డ బ్యారేజీలోని పలు పిల్లర్లు దెబ్బతినడంతోపాటు పునాదుల కింద నుంచి పెద్ద మొత్తంలో ఇసుక కొట్టుకుపోయింది. దీంతో 12 నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే నీటి లీకేజీని ఆపేందుకు దాదాపు 40 వేల ఇసుక బస్తాలు వేసినా.. బ్యారేజీ కింద ఇంకా ఖాళీ ఉన్నట్లు గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించింది. 2019 జూలైలో వచ్చిన వరదల వల్ల బ్యారేజీకి ప్రమాదం ఏర్పడినట్లు మధ్యంతర నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు ప్రారంభించి.. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది.
అయ్యర్ కమిటీ సూచన మేరకు ఈనెల 17న మేడిగడ్డ 7 బ్లాక్‌లోని 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకెత్తినా.. 16వ నంబర్ గేటు ఎత్తే సమయంలో పెద్దగా ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. దీంతో వెంటనే పనులను నిలిపివేసిన అధికారులు.. భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. బొరియ కారణంగా బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
ధ్వనులు, ప్రకంపనల నేపథ్యంలో మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సూచనలు, సలహాలు అందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈ కె.శ్రీకాంత్ కన్వీనర్‌గా మరో నలుగురు సభ్యులను కమిటీలో నియమించారు. వీరు మూడు బ్యారేజీలను సందర్శించి.. సమగ్ర అధ్యయనం చేశాక నివేదిక అందిస్తారు.
అయితే.. మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ముందుగా అంచనా వేయనున్నారు.
నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చి వేయాలని భావిస్తున్నారు.మొత్తానికి కాళేశ్వర పాపం ఇంకా వెంటాడుతూనే ఉంది. నిను వీడని నీడను నేను అంటూ పాడుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇపుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అంటూ బిజెపి నిలదీస్తోంది. బి.ఆర్.ఎస్. కాంగ్రెస్ లు తోడుదొంగలని కమలనాథులు దుయ్యబడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…