మీరు మారిపోయారు సార్

By KTV Telugu On 8 July, 2024
image

KTV TELUGU :-

గులాబీ బాస్ కేసీఆర్ మారిపోయారు. అందరినీ కలుస్తున్నారు. సమస్యలపై చర్చిస్తున్నారు. కేసీఆర్‌ ఎవరితోనూ మాట్లాడరు. ఎవరికీ టైమ్ ఇవ్వరని పదేళ్ళ పాటు ఆరోపణలు వినిపించాయి. కాని కొద్ది రోజులుగా కేసీఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌లో ప్రతి రోజూ పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు. వారు చెప్పేది వింటున్నారు. గులాబీ బాస్‌లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? కేసీఆర్ వ్యూహం ఏంటి?

పుష్కర కాలం పాటు సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్‌ 2014లో ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ళ పాటు సాగిన పాలన తర్వాత గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చారు. అయితే ఆయన అధికారంలో ఉన్నంతకాలం పాలన మినహా పార్టీని, పార్టీ క్యాడర్‌, నాయకుల్ని పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బందులు పడ్డారనే చర్చ జరిగింది. కేసీఆర్ అసలు ఎవరినీ కలవరనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఇదే అంశం మీద ప్రతిపక్షాలు కూడా ఆయన్ను టార్గెట్ చేశాయి.

పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన తర్వాత బీఆర్ఎస్‌కు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్తితి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్‌కు పార్టీ సమావేశాలు నిర్వహించడం ఒక్కటే ముఖ్యమైన పని..ఇందుకు చాలా సమయం చిక్కుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా పదేళ్ళ పాటు కేసీఆర్‌ను కలవడానికి తాము పడ్డ ఇబ్బందుల్ని నేరుగా, ధైర్యంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిచినప్పటినుంచీ గులాబీ పార్టీ బాస్‌లో కొంత మార్పు వచ్చింది అని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభలో బీఆర్ఎస్ బలం జీరోకు పడిపోయింది. దీంతో పాటుగా గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో ఓడిపోయింది.  క్షేత్రస్థాయిలో వున్న బిఆర్ఎస్ క్యాడర్ సైతం ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. దీంతో పార్టీని, క్యాడర్ ను కాపాడుకోవడం అధినేత కేసీఆర్ కు సవాల్ గా మారింది. అందులో భాగంగానే తాను స్వయంగా పార్టీ శ్రేణులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

బిఆర్ఎస్ అధికారం కోల్పోవడం అధినేతలో మార్పుకు కారణం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరినీ కలవరు అనే అపవాదును మోస్తూ వచ్చిన కేసీఆర్ ఆ అపవాదు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అక్కడి నుండే పార్టీ యాక్టివిటీని ఫాలో అప్ చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్య నేతలతో ఫామ్ హౌస్ లోనే మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో పాటు వచ్చే కార్యకర్తలను సైతం కేసీఆర్ కలుస్తున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. దీంతో తమ అధినేతలో మార్పు వచ్చిందనే టాక్ గులాబీ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

కేసీఆర్‌ పార్టీకి అసలు సమయం ఇవ్వకపోవడమే బిఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో ఎవరినీ కలవని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌజ్‌కు వస్తున్నవారందరినీ కలుస్తున్నారు. మరి గులాబీ బాస్‌లో వచ్చిన ఈ మార్పు పార్టీకి ఎంతమేరకు లాభం చేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి