రాయదుర్గం టు ఎయిర్‌పోర్టు మెట్రోకు సంకల్పించిన తెలంగాణ సర్కార్ ఇది సాధ్యమేనా ?
ఇల్లు అలకగానే పండగ కాదు అనే సామెత ఉంది. దీన్నే ఇప్పుడు శంకుస్థాపన చేయగానే మెట్రోలో ప్రయాణించినట్లు కాదు అని మార్చుకోవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ మెట్రో నిర్మాణానికి సంకల్పించారు. కానీ చాలా మందికి ఇది సాధ్యమేనా ? అన్న సందేహం ఎక్కువగా వస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
ప్రస్తుత ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్.
నిర్వహణ మొత్తం ఎల్ అండ్ టీదే.
హైదరాబాద్ మెట్రోకూ రూ. 1745 కోట్ల నష్టం.
తెలంగాణ ప్రభుత్వ సాయం కోసం పదే పదే విజ్ఞాపనలు.
మెట్రోలో తన వాటాను అమ్మేయడానికి ఎల్ అండ్ టీ తీవ్రమైన ప్రయత్నాలు.
ప్రస్తుతం ఉన్న ఎల్ అండ్ టీ మెట్రో కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ లో నడుస్తోంది. నిర్వహణ మొత్తం ఎల్ అండ్ టీదే. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో నష్టాలు భారీగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1745 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఈ ఏడాది ఆ నష్టాలు ఇంకా పెరుగుతాయన్న అంచనా ఉంది. అందుకే ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రభుత్వ సాయం కోసం పదే పదే విజ్ఞాపనలు చేస్తోంది. కానీ తెలంగాణ సర్కార్ ఆదుకుంటామని చెబుతోంది కానీ ఇప్పటి వరకూ ఎలాంటి సాయం చేయలేదు. ఆ మధ్యలో ఓ సారి మెట్రోలో తన వాటాను అమ్మేయడానికి ఎల్ అండ్ టీ తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. తర్వాత ఏమయిందో కానీ ఆ ప్రక్రియలో మందుకెళ్లలేదు.
పెండింగ్‌లో మెట్రో విస్తరణ ప్రణాళికలు.
మెట్రోను ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించాలని గతంలోనే ప్రణాళికలు.
రెండు రూట్లలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో విస్తరించే ప్లాన్లు.
ఫలక్‌నుమా నుంచి ఎయిర్ పోర్ట్ ప్రపోజల్‌కు సర్వే పూర్తి.
ఫలక్‌నుమా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు దూరం 16.6 కిలోమీటర్లు.
జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ పనులు పూర్తి.
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్.
గతేడాది, ఈసారి కలిపి బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయింపు.
కేంద్రం వద్ద హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రణాళికలు దీర్ఘ కాలంలో పెండింగ్‌లో ఉన్నాయి. మెట్రోను ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించాలనే ప్రణాళికలు గతంలోనే వేశారు. రెండు రూట్లలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో విస్తరించే ప్లాన్లు గతంలోనే రెడీ చేశాయి. అందులో ఫలక్‌నుమా నుంచి ఎయిర్ పోర్ట్ అనే ప్రపోజల్‌కు సర్వే పూర్తి చేశారు. ఫలక్‌నుమా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు దూరం 16.6 కిలోమీటర్లు వస్తుంది. జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ.పనుల్లో ఎంజీబీఎస్ వరకు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి గతేడాది ఈసారి కలిపి బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించారు కానీ నిధులు రిలీజ్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సార్లు కేంద్రానికి మెట్రోకు నిధులు కేటాయింపుపై విజ్ఞప్తులు చేసింది కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే హఠాత్తుగా తెలంగాణ సర్కార్ మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకూ మెట్రో విస్తరణ ప్రకటించింది.
సొంతంగా మెట్రో విస్తరణ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లిమిటెడ్.
మెట్రో పనులు పట్టాలెక్కాలంటే ఎన్నో దశలు.
టెక్నికల్ రిపోర్ట్, ఫీజిబిలిటీ రిపోర్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ కాస్ట్ బెనిఫిట్స్.
ఫైనాన్షియల్ అనాలసిస్, సోషల్ వయబిలిటీ కీలకం.
ఏమీ లేకుండానే ప్రభుత్వం కొత్త మెట్రో కారిడర్‌కు శంకుస్థాపన.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అటు ఎల్ అంట్ టీతో కానీ ఇటు కేంద్రంతో కానీ సంబంధం లేకుండా సొంతంగానే మెట్రో విస్తరణ చేపడుతోంది. దీనికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) ప్రభుత్వం ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 13 చివరి తేదీగా నిర్ణయించారు. ఇది కేవలం ప్రాథమికమే. మెట్రో పనులు పట్టాలెక్కాలంటే ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఇందులో టెక్నికల్ రిపోర్ట్, ఫీజిబిలిటీ రిపోర్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ కాస్ట్ బెనిఫిట్స్, ఫైనాన్షియల్ అనాలసిస్, సోషల్ వయబిలిటీ వంటివి ఉంటాయి. ఇవన్నీ పూర్తయ్యే సరికి ఎంత వేగంగా చేసినా ఏడాది సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వివరాలేవీ పూర్తిగా చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెట్రో కారిడర్‌కు శంకుస్థాపన చేస్తున్నది. అంటే ఎన్నికలు జరిగే లోపు శంకుస్థాపన చేశామని చెప్పుకోవడానికి తప్ప పనులు ప్రారంభించే అవకాశం ఉండదు.
ఇప్పటికే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.
అప్పులతోనే ప్రాజెక్ట్ పూర్తి.
ప్యాసింజర్ల నుంచి వసూలు చేసి కడుతామనే గ్యారంటీ.
కాస్ట్ బెనిఫిట్స్, ఫైనాన్షియల్ అనాలసిస్, సోషల్ వయబిలిటీ కష్టం.
రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్ వరకు ఏడాదికి లక్ష మందే ప్రయాణం.
రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్లో ప్రయాణిస్తారని అంచనా.
మరి దీనికి టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తిరిగి చెల్లించడం సాధ్యమేనా ?
హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్, టీఎస్‌ఐఐసీ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు సర్దుబాటు చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీంతో అప్పులు తెచ్చే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. ఆ రూట్లో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి వసూలు చేసి కడుతామనే కన్సెంట్, సర్కార్ గ్యారంటీతో అప్పులు తీసుకోనున్నారు. కానీ కాస్ట్ బెనిఫిట్స్, ఫైనాన్షియల్ అనాలసిస్, సోషల్ వయబిలిటీ వంటి వాటిల్లో ఈ రాయదుర్గం టు ఎయిర్ పోర్టు రూట్ మెట్రో తేలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్ వరకు ఏడాదికి లక్ష మంది వరకే ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడర్లో మైండ్ స్పేస్ బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్పీఏ, హిమాయత్ సాగర్ , రాజేంద్రనగర్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్గో, టెర్మినల్ స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు దాదాపు 8,500 మంది.. రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్లో ప్రయాణిస్తారు. ఎంత డిమాండ్ పెరిగినా వేలల్లో అయితే ఉండరు. మరి దీనికి టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తిరిగి చెల్లించడం సాధ్యమేనా ? అనే సందేహాలు సహజంగానే వస్తాయి.
అటు హయత్ నగర్ ఇటు బీహెచ్ ఈఎల్ వరకూ విస్తరణ ప్రణాళికలు పెండింగ్‌లో !
ఇతర రాష్ట్రాల మెట్రోలకు కేంద్రం సాయం !
తెలంగాణకు మాత్రం మొండి చేయి !
ఇప్పుడు ఈ ప్రయత్నం ముందుకు సాగుతుందా ?
ఎన్నో బాలారిష్టాల తర్వాత 2012లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్ల తర్వాత కానీ అందుబాటులోకి రాలేదు. ప్రారంభించినప్పుడే విస్తరణ ప్రణళికాలు ఉన్నాయి. అటు హయత్ నగర్ ఇటు బీహెచ్ ఈఎల్ వరకూ విస్తరించాల్సి ఉందని చెబుతూ వస్తున్నారు. ఎయిర్ పోర్టు కూడా అందులో ఉంది. కానీ రాజకీయ కారణాలో ఆర్థికంగా గిట్టు బాటుకావడం లేదనో కానీ కేంద్రం కర్ణాటక, కేరళ, చెన్నై వంటి రాష్ట్రాల మెట్రోలకు వేల కోట్లు కేటాయించింది కానీ మరోసారి తెలంగాణ వైపు చూడలేదు. ఇప్పుడు రాష్ట్రమే ముందడుగు వేస్తోంది. కానీ అదంతా తేలిక కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.