హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్న వలసనేతలు

By KTV Telugu On 1 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ కమలంలో కల్లోలం మొదలైంది. కొందరు నేతలు ధిక్కార స్వరం పెంచుతున్నారు. పంతం నెగ్గించుకునేందుకు ఎందాకైనా రెడీ అంటున్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాషాయ పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ హైకమాండ్‌ మీద ఒత్తిడి పెరిగింది. దీంతో అధిష్టానం అసమ్మతి నేతల పట్ల అచితూచి వ్యవహరిస్తోంది. మరి బెదిరింపులకు కమలనాథులు తలొగ్గుతారా ? నేతల డిమాండ్లను నెరవేరుస్తారా? అసలు కాషాయ సేనలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ.

తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక కాషాయ పార్టీకి తలనొప్పులు తెస్తోందా? రెండో జాబితా పేరుతో ఒకే ఒక్క పేరుతో అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీలో కల్లోలం రేపుతోంది. నెలాఖరుకు మిగిలిన అభ్యర్థులందరితో జాబితా విడుదల చేస్తారంటూ ఢిల్లీ నుంచి లీకులుందాయి. కాని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పేరుతో రెండో జాబితా విడులైంది. జితేందర్‌రెడ్డి తన కుమారుడి కోసం పట్టుబట్టి పాలమూరు టిక్కెట్ దక్కించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో రెండు స్థానాల కోసం పట్టుబట్టి… చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యర్థుల నుంచి విమర్శలు రాకుండా పకడ్బందీగా ఎంపిక చేయాలని భావిస్తోంది. జితేందర్ రెడ్డిని మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ అధిష్టానం తొలుత భావించింది. టికెట్ కోసం ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు. తనయుడికి షాద్ నగర్ టికెట్ ఇప్పించాలని జితేందర్ రెడ్డి లెక్కలు వేసుకున్నారు. అయితే కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని.. అది కూడా జితేందర్ రెడ్డి పాలమూరులో పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆయన మీద ఒత్తిడి చేసింది. చివరకు జితేందర్ రెడ్డి డిమాండ్ కే బీజేపీ హైకమాండ్‌ తలొగ్గింది. ఆయన తనయుడు మిథున్ రెడ్డికి మహబూబ్‌నగర్ టికెట్ కన్ఫర్మ్ చేస్తూ రెండో జాబితా విడుదల చేసింది.

ఇక ఈటల రాజేందర్.. తన అనుచరురాలు తుల ఉమకు వేములవాడ టిక్కెట్ ఇవ్వాలని పార్టీలో గట్టిగా పట్టుపడుతున్నారు. ఇదే నియోజకవర్గం టిక్కెట్ తన తనయుడు వికాసరావుకి ఇప్పించాలని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్‌ జవదేకర్‌, సహ ఇంఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌ తో విద్యాసాగర్‌ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ మీద వీరిద్దరి ఒత్తిడి కొనసాగుతుండగానే…మధ్యలో బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చి..కరీంనగర్ తో పాటు వేములవాడ నుంచి కూడా తానే బరిలో దిగుతానని అధిష్టానం పెద్దలతో చెప్పారని టాక్ నడుస్తోంది.

రెండు స్థానాల్లో పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ పెట్టిన ప్రతిపాదనలను బీజేపీ అధిష్టానం లెక్కలోకి తీసుకుంటుందా ? లేదా ? అన్నది చూడాలి.  సంగారెడ్డి అసెంబ్లీ స్థానం దేశ్ పాండేకు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి సీటును పులిమామిడి రాజుకు ఇవ్వాలని ఈటల పట్టుపడుతున్నారు. బండి సంజయ్ తన వర్గీయులకు టికెట్లు దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.మాజీ కేంద్ర మంత్రి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన కుమార్తె విజయలక్ష్మీ కోసం ముషీరాబాద్‌ లేదా సనత్‌ నగర్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు చెక్‌ చెప్పాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో విజయలక్ష్మీకి టికెట్‌ దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక అంబర్ పేట నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం లేదని తేల్చిచెప్పడంతో… ఆయన మనసులో ఎవరున్నది తెలియక క్యాడర్ లో అయోమయం నెలకొంది. కిషన్ రెడ్డి వెన్నంటే ఉంటే ప్రకాశ్ రెడ్డి, గౌతమ్ రావు ఇద్దరు నేతల్లో ఎవరికో ఒకరికి అంబర్ పేట స్థానం కట్టబెట్టే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా టికెట్ల కేటాయింపు ఘట్టాన్ని బీజేపీ నోటిఫికేషన్ నాటికి పూర్తి చేస్తుందో ? లేదో? అనే చర్చ అయితే పార్టీ కేడర్‌లో జరుగుతోంది. టిక్కెట్ల కేటాయింపులో వెనకబడితే ప్రచారంలో కూడా వెనకబడతామనే ఆందోళన పార్టీలో కనిపిస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి