మజ్లిస్ బలం పెరిగితే ఎవరి కొంపలు మునుగుతాయి?

By KTV Telugu On 7 February, 2023
image

మజ్లిస్ ఫ్యాక్టర్ తెలంగాణా ఎన్నికల సమీకరణలను తారు మారు చేసేయబోతోందా 50 స్థానాల్లో అభ్యర్ధులను బరిలో నింపుతామంటోన్న ఒవైసీల వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి. ఎం.ఫ్యాక్టర్ ఏ పార్టీని ముంచనుంది. ఏ పార్టీ నెత్తిన పాలు పోయనుంది. ఎన్నడూ లేనిది ఈసారే 50 స్థానాలకు విస్తరించాలన్న వ్యూహం వెనుక మర్మం ఏంటి. బిజెపికి బీ టీమ్ గా విమర్శలనెదుర్కొంటోన్న మజ్లిస్ రాజకీయంగా తన ఓటు బ్యాంకును మరింతగా విస్తరించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉండచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణాలో రాజకీయ సమీకరణలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల మూడ్ ముదిరిపోయింది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికి ఎవరికి తోచిన యత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బహుముఖ పోటీ ఖాయం. గతంలో మాదిరిగా రెండు పార్టీల మధ్యనో రెండు కూటముల మధ్యనో హోరా హోరీ కాదు. త్రిముఖ పోటీ ఖాయమని ఇప్పటికి అనిపిస్తోన్నా అది బహుముఖం కూడా కావచ్చు. పాలక పక్షం బి.ఆర్.ఎస్. హ్యాట్రిక్ విజయం సాధించి మూడో సారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రెండు వరుస ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయింది. వచ్చే ఎన్నికల్లోనైనా సత్తా చాటి అధికారంలోకి రాలేకపోతే  తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని  కసరత్తులు చేస్తోంది కాంగ్రెస్. మొట్ట మొదటి సారిగా తెలంగాణాలో పాగా వేయాలని బిజెపి పంతంగా ఉంది. అందుకోసం కమనాథులు చేయని ప్రయత్నం లేదు. బి.ఆర్.ఎస్. పార్టీని నిత్యం విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న బిజెపి వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో సత్తా చాటి అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

ఇక హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమై రాజకీయాలు చేసేందుకు ఆవిర్భవించిన మజ్లిస్ పార్టీ కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో  పార్టీ తరపున అభ్యర్ధులను బరిలో దింపుతోంది. బిహార్ లో మజ్లిస్ ఫ్యాక్టర్ తోనే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తృటిలో ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవలసి వచ్చింది. మహారాష్ట్రలోనూ మజ్లిస్ పార్టీ విస్తరించి కొన్ని స్థానాలు దక్కించుకుంది. తెలంగాణాలో కేవలం హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఏడు స్థానాలు చొప్పున  గెలుచుకుంది. 2014లో తెలంగాణలో 35 స్థానాల్లో పోటీచేసిన మజ్లిస్ 2018 ఎన్నికల్లో కేవలం 8 స్థానాల్లో పోటీ చేసి ఏడు స్థానాల్లో జయభేరి మోగించింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉంటూ వచ్చిన మజ్లిస్ పార్టీ  రాష్ట్ర విభజన అనంతరం బి.ఆర్.ఎస్.కి దగ్గరైంది. కేసీయార్ కు నమ్మకమైన మిత్ర పక్షంగా కొనసాగుతోంది మజ్లిస్. అటువంటి పార్టీయే ఇపుడు సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కనీసం 50 నియోజకవర్గాల నుండి  తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని అందులో కనీసం 15 మంది అసెంబ్లీలో అడుగు పెడతారని మజ్లిస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నట్లుండి మజ్లిస్ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో అభ్యర్ధులను బరిలోకి దింపాలని ఎందుకు భావిస్తున్నట్లు. ఈ ప్రకటన చేయడానికి ఒక్క రోజు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓఘటన చోసుకుంది.

మజ్లిస్ పార్టీ అభ్యర్ధులుకు స్పీకర్ ఎక్కువ సేపు మైక్ ఇవ్వడం సరికాదంటూ బి.ఆర్.ఎస్. వర్కింట్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీయార్ వ్యాఖ్యానించారు. కేవలం ఏడుగుగు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మజ్లిస్ కు ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవకాశం ఎందుకివ్వాలని కేటీయార్ నిలదీశారు. ఇది మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీకి మంట పుట్టించిందంటున్నారు రాజకీయ పండితులు. కేటీయార్ తమని చిన్నచూపు చూశారన్న కోపంతోనే మజ్లిస్ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ పాలక పక్షానికి సవాల్ విసిరారు. అయితే ఇది టీ కప్పులో తుపానుగా   చల్లారిపోతుందా లేక నిజంగానే మజ్లిస్ పార్టీ బి.ఆర్.ఎస్.పై కత్తి దూస్తుందా అన్నది చూడాలి.