” ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే జీతాలు ఒక్కటో తేదీనే ఇయ్యమా..” అన్న ఈ డైలాగ్ ఓ ఆర్థిక మంత్రి నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా అది ఆయన వైఫల్యమేనని అనుకోవాలి. ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నప్పటికీ డబ్బుల్లేవు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న కారణంగా ఇవ్వలేకపోతున్నామని ఎవరూ చెప్పుకోరు స్వయంగా అర్థిక మంత్రి చెప్పుకోరు. కానీ ఇక్కడ చెప్పుకున్నది హరీష్ రావు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఇటీవల ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలివ్వలేకపోతున్నామని చెప్పడం వైఫల్యం కిందకే వస్తుంది. ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఈ విషయంలో తన వైఫల్యాన్ని అంగీకరించిటన్లే అనుకోవాలి.
తెలంగాణ ఆర్థిక మంత్రి పదవి ఇప్పుడు కత్తి మీద సాములాంటిది. నిజానికి అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్థిక మంత్రి పదవి నిర్వహణ సులువుగా ఉండాలి. కానీ సంక్షే్మం, ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆదాయానికి మించి ఖర్చులు పెట్టడంతో ధనిక రాష్ట్రమైనా ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికీ హరీష్ రావు అటు సంక్షే్మ పథకాలు ఇటు అనివార్యమైన ఖర్చుల విషయంలో నిధులు సర్దుబాటు చేయడానికి అసిధార వ్రతం చేయాల్సి వస్తోంది. రైతు బంధు పథకానికి రూ. ఏడున్నర వేల కోట్లను సర్దుబాటు చేశారు. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్న పేదలకు రూ. మూడు లక్షలు వచ్చే ఏడాది నుంచి మిగిలిపోయిన రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయాల్సి ఉంది. వీటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించాల్సి ఉంది. మరో వైపు కేంద్రం అప్పులపై పరిమితి పెట్టేసింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రకు ఎంత కావాలంటే అంత అప్పు ఇస్తున్న కేంద్రం తెలంగాణపై మాత్రం పూర్తిగా శీతకన్నేసింది. దీంతో హరీష్ రావు ఓ రకంగా పెను సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు హరీష్ రావు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.
ఆర్థిక శాఖ విషయాన్ని పక్కన పెడితే హరీష్ కు ఉన్న మరో కీలకమైన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ. ఈ శాఖ విషయంలో నిధుల కన్నా పనితీరే ముఖ్యం కాబట్టి ఈ విషయంలో హరీష్ రావుకు సెంట్ పర్సంట్ మార్కులు పడతాయని అనుకోవచ్చు. ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత అనధికారికంగా కొన్నాళ్ల పాటు వైద్య ఆరోగ్యశాఖను హరీష్ రావు చూశారు. ఆ తర్వాత అధికారికంగా శాఖను కేటాయించారు. ముందు నుంచి హరీష్ రావు ఈ శాఖ విషయంలో ఉత్సాహంగా పని చేశారు. హరీష్ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న సమయంలో కరోనా ధర్డ్ వేవ్ ఉంది. ఆ సమయంలో హరీష్ ప్రజల్ని భయాందోళనకు గురి కాకుండా వైద్య సౌకర్యాలు అందరికీ అందడంలో తనదైన సమర్థత చూపారు. ఈ విషయంలో ఆయనను ట్రబుల్ షూటర్ అని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఇటీవల తొమ్మిది జిల్లాలో గర్భిణులకు పౌష్టీకాహార కిట్లను కూడా ఇస్తున్నారు.
ఇక తెలంగాణ వైద్యవిద్యలో దేశంలోనే ప్రముఖ స్థానానికి వెళ్లింది. జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానలను పటిష్ఠం చేస్తున్నది. ఈ క్రమంలో గత ఎనిమిదేండ్లలో 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా యూజీ, పీజీ సీట్లు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన మెడికల్ సీట్లతో పోల్చితే రాష్ట్రంలో యూజీ, పీజీ సీట్ల పెరుగుదల రేటు దాదాపు 50 శాతం అధికంగా ఉండటం విశేషం. 2014-15లో జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ సీట్లు 54,352 ఉండేవి. 2022-23 సంవత్సరానికి వాటి సంఖ్య 93 వేలకు పెరిగింది. అంటే ఎనిమిదేండ్లలో సుమారు 71 శాతం సీట్లు పెరిగాయి. ఇది హరీష్ రావు కృషి, పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
మంత్రిగా హరీష్ రావు రెండు శాఖల కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక శాఖ బాధ్యతల నిర్వహణ విషయంలో ఆయనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇది ఆయన ఒక్క ఆలోచనల మీద నడిపించే శాఖ కాదు. అందరి మీద ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యత అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హరీష్ రావు ఆర్థిక శాఖ నిర్వహణ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు అయితే అదే వైద్య ఆరోగ్య శాఖ విషయానికి వస్తే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారని అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలకు అందుకున్న మెరుగైన వైద్యసదుపాయాలు.. అందుబాటులోకి వస్తున్న వైద్య విద్య దీనికి సాక్ష్యం.