అధికార పార్టీ అంటేనే గ్రూపులు ఉంటాయంటారు. అధికారం కోసం కీచులాట, కొట్లాటలు మామూలేనంటారు. వచ్చే సారి తమకు అవకాశం రావాలన్న ఆకాంక్షతో రాజకీయాలు చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సీటును కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నానా తంటాలు పడుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఈ సంఘర్షణ కనిపిస్తూనే ఉంటుంది. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మంత్రిపై సీనియర్ నేత శ్రీహరి రావు తిరుగుబాటు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆత్మీయ సమ్మేళనాలు విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఉద్యమకారులను పట్టించుకోకుండా సమాచారం ఇవ్వకుండా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని శ్రీహరి రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా కోసం పార్టీ కోసం అన్ని విధాలా నష్ట పోయిన కార్యకర్తలను మంత్రి ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు వలస పాలకులకు తేడా ఏమీ లేదని శ్రీహరి రావు అంటున్నారు.
మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి – శ్రీహరి రావు ఒకప్పుడు గురు శిష్యులు. కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలం పని చేశారు. దశ దిశ మారిన తర్వాత రాజకీయమూ మారింది. గురువు నీడలో ఉంటే ఎదగడం కష్టమన్న అంచనాకు వచ్చిన శ్రీహరి రావు తెలంగాణా ఉద్యమ సమయంలోనే గులాబీ గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా సుధీర్ఘకాలం పని చేశారు. ఆదిలాబాద్ బోథ్ నిర్మల్ ఖానాపూర్ ముథోల్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేశారు. ఈ క్రమంలో 2009 2014 ఎన్నికల్లో నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ హవా 2014లో ఇంద్ర కరణ్ రెడ్డి పై వీచిన సానుభూతి ఆర్థిక వనరుల కొరతతో ఓడిపోయారు. అయితే బీఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్ర కరణ్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కించుకోవడంతో జిల్లా రాజకీయాల్లో ఆయన స్ట్రాంగ్ లీడర్ అయ్యారు. శ్రీహరి రావు దాదాపుగా అనామకుడైపోయారు.
నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఆధిపత్యం పెరగడంతో శ్రీహరి రావుతోపాటు ఉద్యమంలో కష్టపడ్డ నాయకులకు ఆదరణ కరువైంది. దీంతో అప్పటి నుంచే ఆయన అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఈ క్రమంలో 2018 ఎన్నికల సమయంలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అధిష్టానం జోక్యం చేసుకుని రాజీ కుదిర్చింది. ఇంద్రకరణ్ రెడ్డి గెలుపునకు శ్రీహరి రావు కృషి చేశారు. అప్పుడు గనక ఆయన సహకరించకుంటే ఇంద్ర కరణ్ రెడ్డి ఓడి పోయేవారన్న అభిప్రాయాలున్నాయి. ఇంద్ర కరణ్ రెడ్డి మళ్ళీ గెలిచి రెండో సారి మంత్రి అయ్యారు. అవసరానికి శ్రీహరి రావును వాడుకుని దూరం పెట్టారు. నామినేటెడ్ పదవి వస్తుందనుకున్న శ్రీహరి రావుకు అధిష్టానం మొండిచేయి చూపించింది. చూసి చూసి ఆయన ఇప్పుడు లేఖాస్త్రం సంధించారు. నిర్మల్ పార్టీలో నిజమైన నేతలకు గౌరవం లోపించిందని ఆయన ఆరోపించారు. ఇదే పరిస్థితి దాటితే వేరే దారి వెదుక్కోవాల్సి వస్తుందన్న ధోరణిలో ఆయన ఉన్నారు.
శ్రీహరి రావు దూకుడు వెనుక పార్టీ పెద్దల హస్తం కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రకరణ్ రెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి శ్రీహరి రావును నిర్మల్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా మార్చాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు ఒక వాదన ప్రచారంలో ఉంది. ఎందుకంటే నాందేడ్ ప్రాంతంలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ఇంద్రకరణ్ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆ బాధ్యతలు బావుంటాయని ఇంద్రకరణ్ రాణిస్తారని అధిష్టానం భావిస్తోంది. మరో పక్క ఈసారి శ్రీహరి రావుకు న్యాయం చేయకపోతే ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు. దానితో జిల్లా పార్టీని బ్యాలెన్స్ చేసి ఎవరికీ కోపం రాకుండా చూడాలని అధిష్టానం నిర్ణయించుకుందని చెబుతున్నారు. రేపేం జరుగుతుందో చూడాలి.