తెలంగాణలో ఏం జరిగినా తప్పు కేటీఆర్‌దేనా

By KTV Telugu On 23 March, 2023
image

తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా ముందు అందరికీ మంత్రి కేటీఆరే గుర్తుకు వస్తున్నారు. ఆయనకు ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. దానికి తాజాగా ఉాదాహరణ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం. అక్కడ ఉన్న దిగువ స్థాయి ఉద్యోగులు లీక్ చేశారని ప్రాథమికంగా తేలింది. అయితే నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేసాయి విపక్షాలు. కేటీఆర్ పీఏ వరకూ లింక్ పెట్టేసి ఆరోపణలు చేశారు ఆయన పాత్ర ఉందంటున్నారు. ఐటీ మంత్రిని అయినంత మాత్రాన కంప్యూటర్లు మొత్తం తన చేతిలో ఉంటాయా అని కేటీఆర్ కవర్ చేసుకుంటున్నారు కానీ జనంలోనే కాదు విపక్షాలు కూడా ఆయనను కేవలం ఆయనకు కేటాయించిన శాఖల మంత్రిగానే చూడటం ఎప్పుడో మానేశారు. కేటీఆర్ ఇప్పుడు సకల శాఖల మంత్రి అన్ని శాఖలనూ ఆయనే సూపర్ వైజ్ చేస్తూంటారు. అందుకే ఎక్కడ ఏం జరిగినా ఆయననే విపక్షాలు గురి పెడుతున్నాయి.

డ్రగ్స్ కేసులో ఏదైనా జరిగితే ముందుగా కేటీఆర్‌ను విమర్శిస్తారు. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేటీఆరే టార్గెట్ అవుతారు. ధరణి వ్యవస్థ లో వెలుగు చూస్తున్న లోపాలకూ కేటీఆరే కారణమని ఆయన భూదందాలకు పాల్పడ్డారని అంటారు. ఇలా ప్రతీ శాఖలో ఏదైనా లోపం జరిగితే కేటీఆర్‌పైనే ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తారు కానీ ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి జోలికి మాత్రం ప్రతిపక్ష పార్టీలు వెళ్లవు ఇదంతా చాలా కాలంగా జరుగుతోంది. నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు కేటీఆర్ కూడా తనకేం సంబంధం ఫలానా శాఖ మంత్రి ఉన్నారు కదా అని అనరు ఆయనే బాధ్యత తీసుకుంటారు ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తారు. ప్రభుత్వం అంతా మంచిగా చేసిందని విపక్షాలే ఆరోపణలు చేస్తున్నాయని చెబుతూ ఉంటారు. దీంతో తప్పు జరిగిదే ఆయనదే బాధ్యత అని విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభల కోసం కలెక్టరేట్ల ప్రారంభోత్సవం కోసం తప్ప బయటకు వచ్చిన సందర్భాలు లేవు. పాలనా వ్యవహారాలన్నీ ఇప్పటికే కేటీఆర్ చూస్తున్నారు చురుగ్గా పర్యటిస్తున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ల ఓపెనింగ్ అయినా తానే వెళ్తారు. శంకుస్థాపనలు అయినా తానే వెళ్తారు. విద్యా శాఖ ఒప్పందాలకైనా తానే వెళ్తారు. అబ్కారీ శాఖ కీలక సమీక్షలూ తానే చేస్తారు. అయితే ఆయన ఆయన శాఖలకు మంత్రి కాదు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పరు ఎందుకంటే ఆయన సకల శాఖా మంత్రిగా వ్యవహిరంచడం ప్రారభించి ఇప్పటికి చాలా కాలం అయింది. ఇదంతా రొటీనే కదా అనుకుంటున్నారు. అందుకే ఆరోపణలు కూడా ఆయన మీదనే వస్తున్నాయి. ఓ రకంగా హరీష్ రావు నిర్వహించే శాఖలు తప్ప మిగతావన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తాయి ఆయన ఆదేశాల ప్రకారమే పని చేస్తాయి. ఆయా శాఖల మంత్రులు ప్రత్యేకంగా సమీక్షలు చేసే సందర్బాలు కూడా ఉండవు.

కేటీఆర్ కూడా తాను సీఎం స్థాయి బాధ్యతలను అసువుగా నిర్వహిస్తున్నానని ప్రజలు అనుకోవాలని అనుకుంటుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇతర శాఖల విషయంలో జోక్యం విషయంలో ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన చేయలేదు. ఏదో ఓ సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి కేటీఆర్‌కు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కేసీఆర్ అనుకున్నప్పుడల్లా ఈ ప్రచారం జరుగుతోంది. అంటే ఓ విధంగా కేసీఆర్ ఎప్పుడైనా వైదొలిగి కేటీఆర్‌కు బాధ్యతలివ్వొచ్చు అని ప్రజల్లో టీఆర్ఎస్ క్యాడర్‌నూ మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకోవాలి. కేటీఆర్ దానికే సిద్ధమై ఆరోపణల్ని కూడా తనపై వేసుకోవడానికి వెనుకాడటం లేదు.