ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కేటీయార్

By KTV Telugu On 13 May, 2023
image

 

వచ్చే ఎన్నికల్లో తమకి టికెట్ వస్తుందా రాదా అన్న బెంగ బి.ఆర్.ఎస్. సిటింగ్ ఎమ్మెల్యేలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు కేసీయార్  భరోసా ఇచ్చి వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్ ఇస్తున్నాం  పోయి బాగా పనిచేసుకోండి అని హింట్ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కేసీయార్ ఆదేశాల మేరకు కావచ్చు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కూడా తన పర్యటనల్లో కొందరు సిటింగ్ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో వారినే గెలిపించమని పిలుపు నివ్వడం ద్వారా టికెట్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. దాంతో కేటీయార్ తమ పేరు చెప్పకపోవడంతో మరి కొందరు సిట్టింగుల్లో బీపీ పెరిగిపోతోంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ జిల్లాల పర్యటన సిట్టింగుల గుండెల్లో గుబులు రేపుతోంది. కేటీఆర్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగులకు సీటు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారిలో సంతోషం కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్ పట్ల పార్టీ ఎమ్మెల్యేల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎన్నికల శంఖారావాన్ని దాదాపు పూరించారు.

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా ప్రచారం ప్రారంభించేలోగా కేటీఆర్ రాష్ట్రాన్ని ఓ చుట్టు చుట్టేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ విధానాలు వివరిస్తూ బీజేపీ, కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో చర్చకు పెడుతున్నారు. వివాదాలు లేని చోట సిట్టింగులను, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. సమస్యాత్మకంగా ఉన్నవి వివాదాలతో కూడుకున్న సెగ్మెంట్ల అభ్యర్థులపై నిర్ణయం పార్టీ అధినేతే తీసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈమధ్యన తరచుగా కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ సెగ్మెంట్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోదే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి అని తేల్చేసారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను ఇంటికి పంపి వినోద్ ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ నూ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. అటు వరంగల్ లో వినయ్ భాస్కర్ విషయంలోనూ కామారెడ్డి జిల్లా జుక్కల్ లో ఎమ్మెల్యే హన్మంత్ షిండే విషయంలోనూ ఆశీర్వాద సభల్లో కేటీఆర్ నుంచి ఇలాంటి ప్రకటనలే వెలువడ్డాయి. దీంతో కేటీఆర్ పాల్గొనే సభల్లో అభ్యర్థులను ప్రకటించడం చర్చలకు దారి తీస్తోంది. ఎవరెవరినైతే గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారో వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని స్పష్టమవుతోంది. రామగుండంలో ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడుతూ మంచి యువకుడు కష్టపడతాడు ఉద్యమకాలం నుంచీ పనిచేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లేమైనా ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలి అన్నారే గాని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను గెలిపించుకోవాలని ఎక్కడా చెప్పలేదు. ఇక పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత పేరును కూడా కనీసం ప్రస్తావించలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇదే పరిస్థితి అటు బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను గెలిపించాలని కూడా చెప్పలేదు. నియోజకవర్గాల్లో కొందరు కనిపించకపోవడం, ప్రవర్తన సరిగ్గా లేకపోవడం నిత్యం వివాదాలతో సావాసం చేయడం అవినీతి ఆరోపణలెదుర్కోవడం ఇలా క్లీన్ చిట్ లేనివాళ్ల విషయంలోనే మంత్రి ప్రకటనలు చేయడంలేదా అన్న చర్చకూ తెరలేస్తోంది. జిల్లాల పర్యటనలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కొందరు సిట్టింగ్స్, మాజీల్లో సంతోషాన్ని నింపుతోంది. తమ గురించేమీ ప్రకటన చేయకపోవడంతో కొందరు సిట్టింగ్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా రాబోయే రోజుల్లో కేటీఆర్ పర్యటించబోయే నియోజకవర్గాల్లో తమ పేరును ప్రస్తావిస్తూ ప్రసంగం చివర్లో గెలిపించాలని పిలుపునిస్తాడా లేదా అన్న టెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల్లో కనిపిస్తోంది.