ఐటీ దాడుల్లో కీలక విషయాలు
తన కొడుకును చిత్రహింసలు పెట్టారన్న మల్లారెడ్డి
తెలంగాణ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీజేపీ కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు వినియోగిస్తోందని టీఆర్ఎస్ మండిపడుతోంది. దీన్ని తమ ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణిగా పరిగణిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని మంత్రి తలసాని అంటే తెలంగాణలో మరిన్ని ఐటీ దాడులు జరుగుతాయని, తనపైన కూడా జరితే అవకాశం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లవారు జామునే మొదలైన ఐటీ సోదాలు మరుసట రోజు కూడా కొనసాగాయి. మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో 50 బృందాలుగా ఏర్పడి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. ఈ దాడుల్లో మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధించిన అనేక కీలక విషయాలు గుర్తించారు. ఆయన ఒక ప్రత్యేకమైన బ్యాంకు ద్వారా వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్టు ఇన్కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు.
తన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇతర వ్యాపారాలకు చెందిన లావాదేవీలన్నీ ఊరు పేరు లేని ఒక చిన్న కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా కొనసాగిస్తున్నారని తెలుసుకున్నారు. మల్కాజ్ గిరి లో ఉన్న క్రాంతి బ్యాంక్ కేంద్రంగా మల్లారెడ్డి కి చెందిన వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయని గుర్తించారు. క్రాంతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థల చైర్మన్ వీ రాజేశ్వర గుప్త మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి అని సమాచారం. ఆయన ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రాంతి బ్యాంకు నుంచి స్థిరాస్తి వ్యాపారానికి నిధులు దారి మళ్ళాయి అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక సోదాల సమయంలో మల్లారెడ్డి ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయన తన మొబైల్ ఫోన్ ఐటీ అధికారులకు చిక్కకుండా దాచిపెట్టారని తెలుస్తోంది. అయితే పక్క ఇంట్లో ఒక గోనెసంచిలో మల్లారెడ్డి ఫోన్ ఉండడాన్ని ఐటీ అధికారులు గుర్తించి ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఆరు నెలలుగా మల్లారెడ్డి లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రికి సంబంధించిన దాదాపు మూడు వందల బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటివరకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఇళ్లు, ఆఫీసుల్లో చేసిన తనిఖీలలో సుమారు ఐదు కోట్ల నగదు, అనేక కీలకమైన పత్రాలు, ఆస్తిపాస్తులు వివరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఐటీ సోదాలపై మంత్రి స్పందించారు. టీఆర్ఎస్ మంత్రిని అయినందునే తనపై కక్ష కట్టారు తానేమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నానా…? ఐటీ అధికారులు తన కొడుకును చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. సోదాలతో తన కుటుంబం మానసిక ఒత్తిడికి గురవుతుందని చెప్పారు. బంధువుల ఇంట్లో డబ్బు దొరికితే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. మరోవైపు ఐటీ సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద సీఆర్పీఎఫ్ పోలీసులను మోహరించారు. మొత్తానికి ఐటీ సోదాలతో తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.