అటు ఐటీ దాడులు…ఇటు చిల్లర కేసులు
ఐటీ అధికారిపై దోపిడీ కేసు
ఊ అన్నా… ఆ అన్నా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేలా మారింది తెలంగాణలో పరిస్థితి. నువ్వు నా మీద ఫిర్యాదు చేస్తే నేను నీ మీద చేస్తా అన్నట్లు పోటీలు పడుతున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెండు రోజల పాటు జరిగిన సోదాల్లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబీకులు ఐటీ అధికారుల వ్యవహార శైలిపై ఆరోపణలు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఐటీ అధికారి రత్నాకర్ పై మంత్రి మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ దాడులు విశ్వసనీయంగా అనిపించడంలేదని, నకిలీ దాడుల్లా ఉన్నాయని, సోదాలపై తన సోదరుడు మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకాలు చేయించుకునేందుకు ప్రయత్నించారంటూ భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ పై ఐపీసీ 384 కింద దోపిడీ కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును రత్నాకర్ హైకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆయన మీద నమోదైన కేసు విచారణపై కోర్టు స్టే విధించింది. రత్నాకర్ ను 4 వారాల పాటు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
మరోవైపు మల్లారెడ్డి మీద చోరీ కేసు నమోదైంది. సోదాల సందర్భంగా తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, వారంట్లను మంత్రి లాక్కున్నారంటూ ఐటీ అధికారి రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్‌లో ఉన్న కీలక సమాచారాన్ని తొలగించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డిపై బోయినపల్లి పోలీసులు ఐపీసీ 379, 342,353,201,203,504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బలవంతంగా నిర్బంధించడం, దాడి చేయడం, నేర ఆధారాల్ని ధ్వంసం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అవమానించడం, బెదిరించడం లాంటి సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. ఆ తరువాత కొద్ది సేపటికి మల్లారెడ్డి అనుచరులు ల్యాప్ టాప్ ను పోలీసులకు అప్పగించడం విశేషం. కానీ దాన్ని అధికారులు తీసుకెళ్లలేదు. ఆ ల్యాప్‌టాప్ తమది కాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ల్యాప్ టాప్ బోయిన్ పల్లి పోలీసుల వద్ద ఉంది. ఘటనలు జరిగిన ప్రాంతం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో బోయినపల్లి పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విధంగా ఇరు వర్గాలు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.