డోనేషన్ల రూపంలో కలెక్ట్ చేశారని ఐటీ అనుమానం
వంద కోట్లపైనే ఐటీ అధికారుల ఫోకస్
ఆ వంద కోట్లు ఎక్కడివి…? ఆ డబ్బు ఎలా సేకరించారు…? ఎక్కడ డిపాజిట్ చేశారు..? ఇవీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆడిటర్‌కు ఐటీ అధికారులు సంధించిన ప్రశ్నలు. రెండో రోజు జరిగిన విచారణ కూడా వంద కోట్ల చుట్టే తిరిగింది. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో నవంబర్ 22న తెల్లవారుజాము నుంచి 24వ వరకు జరిగిన దాడుల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలతో పాటు సుమారు రూ.15 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల తరువాత ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డి సహా 16 మందికి సమన్లు జారీ చేశారు. మొదటి రోజు 12 మంది హాజరయ్యారు. రెండో రోజు మరికొందరు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం హాజరు కాలేదు. ముఖ్యమైన పనులు ఉన్నందున మల్లారెడ్డి తనకు బదులు ఆడిటర్‌ను పంపించారు.
మొదటి రోజు మాల్లారెడ్డి చిన్నకొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తండ్రి మర్రి లక్ష్మారెడ్డి, ఎంఎల్ఆర్ కాలేజి ఛైర్మన్ నరసింహారెడ్డి, నర్సింహారెడ్డి కొడుకు త్రిశూల్‌రెడ్డి, మెడికల్ కాలేజీ ఛైర్మన్ రామస్వామిరెడ్డి, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ శివకుమార్‌రెడ్డి, మెడికల్ కాలేజీ అకౌంటెంట్, ప్రిన్సిపల్ మాధవి, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మహిళా అకౌంటెంట్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మరో అకౌంటెంట్ ఉన్నారు. వీరందరినీ 8 గంటల పాటు విచారించారు. రెండో రోజు మల్లారెడ్డి ఆడిటర్ తో పాటు కాలేజీల ప్రిన్స్పాళ్లు, అకౌంటెంట్లను నాలుగు గంటల సేపు విచారించారు.
మల్లారెడ్డికి చెందిన మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో భారీగా అవకవతకలు జరిగాయని డొనేషన్ల పేరుతో రూ.100 కోట్ల పై చిలుకు డబ్బులు అక్రమంగా వసూలు చేసి ఇతర వ్యాపార సంస్థలకు బదలాయించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మొదటి రోజు మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డిని, మంత్రి అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని వైద్య ఇంజనీరింగ్ కళాశాల్లో సీట్ల కేటాయింపుల సందర్భంగా రూ.100 కోట్ల పై చిలుకు డబ్బులు వసూలు చేశారన్న అభియోగంపై ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఐటీ దాడుల సందర్భంగా ఇళ్లలో దొరికిన రూ.15 కోట్లకు సంబంధించి వివరాలు రాబట్టే పనిలో అధికారులున్నట్లు సమాచారం.
రెండో రోజు కూడా ఆడిటర్‌కు, ప్రిన్స్‌పాల్స్‌కు, అకౌంటెంట్లకు అవే ప్రశ్నలు సంధించారు. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఫీజులు, డొనేషన్లు ఏ రూపంలో తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు,ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను చూపించి ఆడిటర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఏయే కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతాలున్నాయని ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వంద కోట్ల రూపాయలు ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైన సమాచారం రాబట్టారు. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రసీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిన ఆ విషయాలపై ఆరా తీశారు. రెండో రోజు కూడా మల్లారెడ్డి ఐటీ విచారణకు హాజరుకాలేదు. పైగా తనను ఐటీ వదిలేసిందని మీడియా మాత్రం తనను వదిలేయట్లేదని వ్యాఖ్యానించారు. ఆయన అనుకుంటున్నట్లుగా ఐటీ మల్లారెడ్డిని ఇప్పుడప్పుడే వదిలిపెట్టేలా లేదు.