ఇస్మార్ట్ మంత్రి తస్మాత్ జాగ్రత్త..

By KTV Telugu On 24 December, 2022
image

తెలంగాణలో ఆ మంత్రికి నిద్ర కరువైంది. నేను ఇస్మార్ట్‌ అని చెప్పుకునే ఆ మినిస్టర్‌ను ఇప్పుడు కొందరు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఓ వైపు ప్రత్యర్థుల టార్గెట్, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు. ఇది చాలదన్నట్టు మధ్యలో మరికొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటిదాకా ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన మంత్రి మల్లన్నను ఎమ్మెల్యే మైనంపల్లి మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి పరేషాన్ చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో మంత్రి వేలుపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఏవో చిన్న సమస్యలని కూర్చొని మాట్లాడుకుంటామని మంత్రి చెప్పినప్పటికీ ఈ పంచాయతీ ఇంతటితో సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదు. మళ్లీ తిరుగుబాటు వర్గం తిరుమల దర్శనానికి వెళ్లి కొండపై మీటింగ్‌ పెట్టుకోవడం కలకలం రేపుతోంది.

మేడ్చల్ జిల్లాలో మంత్రి ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని పార్టీలోని పదవులన్నీ తన వర్గానికే ఇచ్చుకుంటున్నారని ఐదుగురు ఎమ్మెల్యేలు మల్లన్నపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాల వల్ల తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో పనులు కాకుండా అడ్డుకుంటున్న మల్లారెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఈమేరకు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఇంట్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే తాజాగా వీరు మరోసారి తిరుమల కొండపై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తిరుమలకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ నుంచి తిరుమలకు కలిసివెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ ఐదుగురు కొండపై సమావేశమయ్యారు.

మంత్రిపై అధికార పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక ఉన్నది అసంతృప్తేనా? లేక ఈ ఐదుగురి అసమ్మతి వెనకాల బీజేపీ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల ప్రలోభాల అంశంపై రాష్ట్రంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పర్సనల్ మీటింగ్‌లు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మొత్తంగా మల్లన్న లక్ష్యంగా అతని చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు బీఆర్ఎస్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంత జరిగినా మల్లారెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. కేటీఆర్ వర్సెస్ బండి మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలోకి మినిస్టర్ మల్లన్న దూరారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా లేవని, ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీకి సవాల్ విసిరారు.

ఈ పరిణామాలు ఇలా ఉంటే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు కట్టిన ఫ్లెక్సీ మరో వివాదానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. అయితే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా ధర్నా అంటూ మల్లారెడ్డి అనుచరులు మేడ్చల్‌లో ఫ్లెక్సీ వేశారు. ఆ తర్వాత ఖంగుతిని దానిని తీసేసినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం మల్లారెడ్డికి చెందిన అనేక సంస్థల్లో ఐటీ సోదాలు చేసింది. ఆ తర్వాత వారిని విచారణ కూడా చేసింది. ఏం జరిగినా తమ సారు కేసీఆర్ చూసుకుంటారులే అని అంటున్నాడు మల్లారెడ్డి.