రాజకీయ నాయకుల్లో కొంత మంది ప్రజా నాయకులు ఉంటారు. మరికొంత మంది పొలిటికల్ మెనేజ్మెంట్ చేసే వాళ్లు ఉంటారు. రెండు వర్గాల వాళ్లకూ పదవులు వస్తాయి. కానీ ప్రజా నాయకుల పనితీరు భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ లో కే.కేశవరావు ఉంటారు. ఆయన పార్లమెంటరీ పార్టీ నేత. కానీ ప్రజల్లో ఎప్పుడూ కనిపించరు. పోటీ చేయడం లాంటివి చేయరు. ఆయన పనితీరు భిన్నంగా ఉంటుంది. అదే ప్రజానాయకుల పనితీరు భిన్నంగా ఉంటుంది. వారు అటు ప్రభుత్వ పనుల్ని ఇటు ప్రజల పనుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.
తెలంగాణ మంత్రి వర్గంలో ఉన్న ప్రజానాయకుల్లో ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆలుగడ్డ శీనన్న, మోండా మార్కెట్ శీనన్న అంటూ జనం ఆప్యాయంగా పిలుచుకునేలా ఎదిగారు తలసాని. తెలంగాణ ఏర్పడే వరకూ సమైక్యవాది. ఇప్పుడు కరుడు గట్టిన తెలంగాణ వాది. కారణం ఏదైనా ఉద్యమంలో ఆయనకు పెద్దగా పాత్ర లేనప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధిక కాలం కీలకమైన శాఖలకు మంత్రిగా ఉంటున్నారు. తొలి విడతలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి మంత్రి అయ్యారు. రెండో సారి బీఆర్ఎస్ నుంచే గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఫిషరీష్ , పశు సంవర్థక, సినిమాటోగ్రీఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి తలసాని మంత్రి పదవిలో ఉంటూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి న్యాయం చేశారా ? రెండో విడతలో మంత్రిగా ఆయనకు ఎన్ని మార్కులు వేయవచ్చు ?
తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న శాఖలు నేరుగా ప్రజలకు సంబంధించినవి కాదు. ఫిషరీష్ పశుసంవర్థకశాఖగా ఆయన కాస్త ప్రజలతో మమేకయ్యే పని ఉంటుంది. పల్లెల్లో ఆయనకు చాలా పని ఉంటుంది. కానీ ఆయన పనితీరుపై మాత్రం గొప్పగా చెప్పుకునే అంశాలు ఏవీ గత నాలుగేళ్లలో కనిపించడం లేదు. పశుసంవర్థక శాఖ మంత్రిగా తలసాని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఎంతో మైలేజ్ తెచ్చేలా పని చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా ప్రభుత్వం చేపట్టిన స్కీమ్ ద్వారా ఎంతో మేలు చేయవచ్చు. మొదటి విడత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖ ద్వారా కల్పించిన ప్రయోజనం రెండు, మూడు శాతం ఓట్లను పెంచింది. దానికి కారణం గొర్రెల పంపిణీ వంటి పథకాలు. అప్పట్లో చురుగ్గా ఈ పథకం అమలయింది. కానీ రెండో విడతలో తలసాని మంత్రిగా ఉండి ఈ పథకాన్ని కనీస మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.
గొల్లకురుమలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరగడానికి కారణం గొర్రెల పంపిణీ నిలిచిపోవడమే. పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ యూనిట్లు మంజూరు చేస్తామని సంఘాల దగ్గర నుంచి మ్యాచింగ్ గ్రాంట్ కట్టించుకున్నారు. కానీ పంపిణీలో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల సమయంలో కూడా ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. అప్పటికప్పుడు గొర్రెలకు బదులు నగదు ఇస్తామంటూ ప్రభుత్వం సంఘాల ఖాతాల్లో నగదు జమ చేసింది. కానీ ఇప్పుడు ఇతర చోట్ల కూడా ఇలాంటి ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం నుంచి కదలిక ఉండటం లేదు. మంత్రిగా తలసాని బాధ్యత తీసుకుని ఈ విషయంలో గొర్రెలు ఇప్పించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ విషయంలో ముందడుగు పడటం లేదు. మంత్రిగా ఈ విషయంలో తలసాని విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఇక ఇతర ఫశుసంవర్థక పథకాల విషయంలోనూ పెద్దగా పురోగతి లేదు. ఫిషరీష్ మంత్రిగా కూడా ఆయన పనితీరు అంతంతమాత్రమే. చెరువుల్లో చేప పిల్లలు విడిచి పెట్టడానికి ఆంధ్రా కాంట్రాక్టర్కు టెండర్లు ఇచ్చారు. వారు అవినీతికి పాల్పడిన అంశం కలకలం రేపింది. ఈ చేప పిల్లల వివాదాలు తలసానిని చుట్టముట్టాయి.
తలసానికి ఉన్న మరో కీలకమైన శాఖ సినిమాటోగ్రీ. ఇది ప్రజలతో నేరుగా సంబంధం ఉండదు. కానీ ప్రజల్ని ప్రభావితం చేయగల మీడియం అయిన సినిమా రంగం ఈ శాఖ గుప్పిట్లో ఉంటుంది. సినిమా వాళ్లతో మంచి సంబంధాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా వ్యవహారించడంలో తలసాని చక్రం తిప్పారు. టాలీవుడ్ నుంచి రాజకీయంగా ఎవరు యాక్టివ్ గా ఉన్నా బీఆర్ఎస్ గురించి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడరు. టాలీవుడ్ ను ఈ రకంగా గ్రిప్ లో ఉంచుకోవడంలో తలసాని సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు.
మంత్రిగా ప్రభుత్వానికి తలసాని మంచి పేరు తెచ్చేలా పని చేయలేకపోయారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. దానికి ప్రభుత్వ ప్రాధాన్యతలు నిధుల లేమి వంటివి కారణం కావొచ్చు. అయితే మంత్రిగా పార్టీకి ఆయన ఎంత మేలు చేశారన్నది కూడా కీలకమైన అంశమే. మంత్రి పదవులు ఇస్తున్నారు అంటే పార్టీ అధినేత వారు పార్టీకి మేలు చేస్తారని ఎక్కువ ఆశిస్తారు. అందులో ఎలాంటి ఆలోచనా ఉండదు. రాజకీయంగా అత్యంత కీలకమైన జంట నగరాల నుంచి మంత్రిగా ఉన్న తలసాని బీఆర్ఎస్ బలోపేతానికి ఎంత కృషి చేశారు. ఎంత సక్సెస్ అయ్యారు అని విశ్లేషిస్తే ప్చ్ అని అనక మానదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన బాధ్యతలు తీసుకున్న ఇలాఖాలో బీజేపీ విజయాలు నమోదు చేసింది. బీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని పొంది ఉంటుంది కానీ అందులో తలసాని చేసిన మ్యాజిక్ ఏమీ లేదని చెప్పుకోవచ్చు. పదవి సుదీర్ఘ కాలం ఉండి రొటీన్ అయిపోతే రాజకీయంగానూ సవాళ్లను స్వీకరించకుండా రిలాక్స్ అయితే ఎలా ఉంటుందో తలసాని పరిస్థితి అలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తలసాని పలురకాల వివాదాల్లో చిక్కుకోవడం కూడా మైనస్ గా మారింది. ఆయన చుట్టూ ఇప్పుడు ఈడీ వల విసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ విషయంలో తలసాని పీఏ సహా బంధువులు సన్నిహితుల్ని ఈడీ విచారణ జరిపింది. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. అలాగే మరికొన్ని వివాదాల్లోనూ తలసాని వేలు పెట్టారు. అటు వ్యక్తిగత వివాదాలు ఇటు పనితీరు పరంగా చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్కు యావరేజ్ మార్కులు వేయవచ్చు. తలసాని మంత్రివర్గంలో కేసీఆర్కు అటు బారం కాదు ఇటు బలం కాదని నిర్ణయించుకోవచ్చు.