తెలంగాణ బీజేపీలో కోవర్టులున్నారా ?

By KTV Telugu On 30 January, 2023
image

బీజేపీలో ఇప్పుడు నేతలందరికీ పక్కనోళ్లను చూస్తే భయమేస్తోంది. ఏ మాట్లాడితే ఎక్కడే ఏం తప్పు అవుతుందోనని ఆందోళన వారిలో కనిపిస్తోంది. ప్రతీ మాట చేరాల్సిన చోటికి చేరిపోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక మాట మాట్లాడితే పది కలిపి అధిష్టానానికి చేరిపోతుందన్న భయం వణుకు నేతల్లో కనిపిస్తోంది.

కొద్ది రోజులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం. హుజరాబాద్ గులాబీ కోట మీద కాషాయ జెండా ఎగురవేసిన ఈటల. ఇప్పుడు మాత్రం బీజేపీలో తన మాట నెగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర శాఖను పట్టించుకోకుండా ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండే రాజేందర్ కు రాష్ట్ర శాఖ నేతలు ఎర్త్ పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈటలతో ఎక్కువగా మాట్లాడకపోవడం ఆయనకు ఏ విషయం చెప్పకపోవడం లాంటి చర్యలతో రాష్ట్ర పార్టీ సారథులు ఈటలను ఒంటరి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆధిపత్య పోరులో తాను బాగా వెనుకబడిపోతున్నానన్న ఆందోళన ఈటలలో రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ విస్తరణకు తానిచ్చే సలహాలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో ఈటల ఉన్నారు. ఏదో అనుకుని బీజేపీలోకి వస్తే ఏదో జరుగుతోందంటూ ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నారు.

ఈటలకు ఆ పార్టీలో ఎవరితోనూ సఖ్యత లేదు. తన చేరికకు పరోక్ష కారణం అయిన వివేక్ వెంకట స్వామితో గొడవలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆధిపత్యపోరు ఇప్పుడాయన్ను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. పైగా బీజేపీలోకి వచ్చీ రాగానే ఆయను చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఒక్క నాయకుడిని కూడా ఆయన తీసుకొచ్చి పార్టీలో చేర్చలేకపోయారు. అదే ఆయన పరపతి పలుచబడి పోవడానికి కారణమవుతోంది. బీజేపీలో చేరబోయే నేతల పేర్లను పార్టీలోని తన ప్రత్యర్థులు ముందే లీక్ చేస్తున్నారని ఈటల గుర్తించారు. దానితో చేరాలనుకున్న వారు కూడా ముందూ వెనుక ఆలోచించుకుని ఆగిపోతున్నారు. మొత్తం విషయం అర్థం చేసుకున్న ఈటల డైరెక్టుగా ఆమాట చెప్పలేక పార్టీలో కోవర్టులున్నారంటూ కొత్త డైలాగులు వదులుతున్నారు. ఈటల కామెంట్స్ తో ఒక్కసారిగా బీజేపీలో చలనం వచ్చేసింది. అసలా లీకువీరులు ఎవరన్న చర్చ మొదలైంది.

బీజేపీలో పరిస్థితిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరగానే అర్థం చేసుకున్నారు. కమలం పార్టీలో కోవర్టులన్నారని తేల్చేస్తూ స్టేట్ మెంట్లు వదులుతున్నారు. కమలనాథులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారికి అక్కడ అసలు గౌరవం లభించడం లేదని అందుకే తిరిగి హస్తం పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఫీలర్లు వదులుతున్నారు. దీనితో ఇప్పుడు బీజేపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీలో ఎవరో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అన్ని విషయాలు చేరవేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తులన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు, దానికి అధిష్టానం ప్రతినిధులు కూడా సహాయం అందిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న తెలంగాణ పర్యటనకు వస్తారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ మీటింగుల్లో కూడా పాల్గొంటారు. అప్పుడు నేతల మధ్య పంచాయతీ ఆయన దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే బండి సంజయ్ పై మోదీకి అపారమైన నమ్మకం ఏర్పడింది. మరి ఈటల వర్గం చెప్పే మాటలను ఆయన నమ్ముతారో లేదో చూడాలి.