మిర్యాలగూడ ఎమ్మెల్యేకు పొత్తుల భయం

By KTV Telugu On 1 April, 2023
image

ఎన్నికల తేదీలు ప్రకటించకముందే ముందస్తు ఎన్నికల చర్చ కొనసాగుతుండగానే కొన్ని నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాఅనే కంటే ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండు నియోజకవర్గాలైతే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అభ్యర్థికి వామపక్షాలు మద్దతిచ్చిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో రెండు వర్గాలకు పొత్తు ఖాయమనిపించింది. అదీ కూసుకుంట్ల పది వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఆ ఓట్లు తమవేనని వామపక్షాలు చెప్పుకోవడంతో పొత్తు అనివార్యమన్న టాక్ బలపడింది. అదే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం నల్గొంగ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టెన్షన్ కు కారణమవుతోంది. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు కాకపోతే అది అంత సులభమైన ప్రక్రియ కాదని అధికార పార్టీ వర్గాలే అంటున్నాయి. దానితో ఇప్పుడు ఎవరికి పక్కన కూర్చోబెడతారన్న చర్చ ఊపందుకుంది. అలాంటి వారిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు కూడా ఉండొచ్చని లీకులు రావడంతో ఆయనకు భయం పట్టుకుంది.

పొత్తు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సీట్లు కమ్యూనిస్ట్ లకు కేటాయించే అవకాశం ఉంటుంది. సీఎం కెసిఆర్ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగిస్తే మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందు మిర్యాలగూడ కమ్యూనిస్టుల కంచుకోట. కాంగ్రెస్ కు వామపక్షాలకు అక్కడ తీవ్ర స్థాయిలో పోటీ ఉండేది. ఇప్పుడు కూడా వామపక్ష భావజాలం ఉన్న ఓట్లర్లు ఎక్కువేనని చెప్పాలి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటోంది. గత సెప్టెంబర్ 11న బీఆర్‌ఎస్‌ సీపీఎం మధ్య పొత్తు కుదిరి రంగన్నకు టికెట్‌ ఇస్తే తానే దగ్గరుండి గెలిపిస్తా అని జూలకంటి రంగారెడ్డి ప్రజా గొంతుక పుస్తకావిష్కరణ సభలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రకటించారు. ఆ ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ కొన్నాళ్ళుగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మనసు మారింది. కమ్యూనిస్ట్ లకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

భాస్కర్ రావుకు ఇప్పుడు మిర్యాలగూడ టికెట్ అవసరం. ఎందుకంటే వేరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేయలేరు. టికెట్ ఇచ్చినా గెలుస్తారన్న నమ్మకం లేదు. పైగా ఎమ్మెల్సీ లేదా మరో విధంగా అడ్జెస్ట్ చేస్తామని అధిష్టానం నుంచి హామీ రాలేదు. దానితో భాస్కర్ రావు సాధ్యమైనంత వరకు కమ్యూనిస్టులకు దూరంగా ఉంటూ తన నిరసనను తెలియజేస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభకు రావాలని ఎమ్మెల్యే భాస్కర్ రావును ఆహ్వానించినా వెళ్ళలేదు. ఇక సీపీఎం జన చైతన్యయాత్రలో పాల్గొనాలని రంగారెడ్డి కొద్ది రోజుల క్రితమే భాస్కర్‌రావును ఆహ్వానించినా ఆత్మీయ సమ్మేళనాల్లో బిజీగా ఉన్నానంటూ గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో సీపీఎం జన చైతన్య యాత్రకు స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరై సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా మిర్యాలగూడ ఎమ్మెల్యే మాత్రం దూరంగా ఉన్నారు. అక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది.

బీఆర్‌ఎస్ తో పొత్తు ఉన్నా లేకున్నా మిర్యాలగూడ నుంచి తమ అభ్యర్థి పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడలో జరిగిన సభలో ప్రకటించారు. మిర్యాలగూడలో సిపిఎం పోటీ చేయడం ఖాయమన్నారు. దీనికి కొద్ది నిమిషాల ముందే బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో సీపీఎంకు సీటు పోతుందనే అపోహలు వద్దని మిర్యాలగూడ నుంచి తానే పోటీలో ఉంటానని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రకటించుకున్నారు. సీటు తనదేనని టికెట్ తనకి బరాబర్ వస్తుందని 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ సీటును అంత ఈజీగా వదులుకోనని నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడవద్దని స్పష్టం చేశారు. మొత్తానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ విషయంలో బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ నేతల బహిరంగ ప్రకటనలతో అంతటా చర్చ జరుగుతోంది. అలాగని వారి మాటే ఫైనల్ కాదు. కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికీ తెలీదు. కమ్యూనిస్టులతో ఆయన ఏం మాట్లాడారో తెలియాల్సి ఉంది. అందుకే అంటారు ఏ పుట్టలో ఏ పాము ఉందనని