తెలంగాణ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు నిత్యం కొత్త ఒరవడిని సృష్టిస్తుంటాయి. నేతల తీరులో కొత్తదనం విచిత్ర పోకడలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు అదే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే పోకడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారిద్దరూ సరికొత్త గేమ్స్ తో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరు మానకొండూరు ఎమ్మెల్యే రసమయిబాలకిషన్ కాగా మరొకరు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. జనంలో జనంతో కలిసిపోవాలన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వాళ్లిద్దరూ నియోజకవర్గాల్లో వేకువఝామునే ఇంటింటికి తిరుగుతున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తొలి పొద్దు అంటే చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పొద్దు పొడుపు అంటూ జనంలోకి వెళ్తున్నారు.
నిజానికి రసమయి బాలకిషన్ మానకొండూరులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ కాంగ్రెస్ నేతను ఫోన్లో బండ బూతులు తిట్టడం సంచలనం సృష్టించింది. ఇక గన్నేరువరం మండలంలోని గండ్లపల్లి రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికులు ఆయన్ను నిలదీయడం కారు వెంబడి పరుగెత్తి మరీ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపింది. రెండోసారి అధికారంలోకి వచ్చినా గండ్లపల్లి రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గ్రామస్తులు ఆయన్ను గట్టిగా నిలదీశారు. గడిచిన మూడు నాలుగేళ్లుగా అభివృద్ధిలో మానకొండూరు వెనుకబడ్డదనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. కరీంనగర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న మానకొండూరు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క పనీ జరగలేదు. దీంతో ఇటీవల అధిష్టానం రసమయి బాలకిషన్‌కు నియోజకవర్గంలోనే ఉండి పనితీరును మెరుగు పరుచుకోవాలని ఆదేశించింది.
అందుకే తొలిపొద్దు అంటూ ఇంటింటికీ వెళ్లి చెక్కుల పంపిణీ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, రైతు బీమా పథకాల చెక్కులతో జనాలను పలకరిస్తున్నారు. గతంలో ఆయా చెక్కులన్నీ స్థానిక నేతలే పంచేవారు. కానీ అభివృద్ధి పనులేమీ లేకపోవడంతో కనీసం చెక్కుల పంపిణీ అయినా ఇంటింటికీ వెళ్లి చేస్తే జనంలో ఉండొచ్చన్న ఆలోచనతోనే కార్యక్రమాలు మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. ఇక చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పొద్దు పొడుపు కార్యక్రమంతో గడప గడపకు వెళ్తున్నారు. ఆయన కూడా చెక్కుల పంపిణీ తప్ప అభివృద్ధి విషయంలో ముందడుగు పడలేదనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చొప్పదండి మండలంలో సెంట్రల్ లైటింగ్ పనుల కోసం నిధుల మంజూరు మినహా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలోనే ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి ఇప్పటివరకు జరగకపోవడం రవిశంకర్‌కు అతిపెద్ద మైనస్ అంటూ గులాబీ పార్టీలోనే చర్చలు సాగుతున్నాయి.
ఇటీవల కేసీఆర్ వంద కోట్లు ప్రకటించినా ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులను ప్రసన్నం చేసుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రమ పడుతున్నారని సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటం వల్లే ఊళ్లకు వస్తున్నారని లేనిపక్షంలో ఇటు వైపు కూడా చూడరని జనం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను గుర్తించి వారిని మళ్లీ తమవైపుకు తిప్పుకునేందుకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాని నుంచి బయట పడాలంటే ఇద్దరూ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.