ఎన్నికల బరిలో ఎమ్మెల్యే సీతక్క వారసుడు

By KTV Telugu On 7 January, 2023
image

ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తండాలకు నడుచుకుంటూ వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకునే సీతక్కను సోషల్‌ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీతక్క టీపీసీసీ చీఫ్ రేవంత్ కు సీతక్క ప్రధాన మద్దతుగా దారుగా ఉన్నారు. ఇటీవల టీపీసీసీ నియమించిన కమిటీల విషయంలో జరిగిన గొడవ కారణంగా తన పార్టీ పదవికి రాజీనామా చేసారు. తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ములుగు నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు సీతక్క. అయితే ఈసారి ఆమె తన కుమారుడిని కూడా ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఆమె కుమారుడు సూర్య ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు. ములుగు సరిహద్దు నియోజకవర్గం అయిన పినపాకలో సైలెంట్ గా పని చేసుకుంటున్నారు. పినపాక కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇప్పటికే ఆయనకు అధిష్టానం నుంచి హామీ వచ్చినట్లు చెబుతున్నారు.

సూర్యకు టికెట్‌ కన్‌ఫమ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో తల్లీ – కుమారుడు ఎన్నికల బరిలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో పినపాకలో రేగా కాంతారావు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ కు అభ్యర్ధి లేకుండా పోయారు. దీంతో పినపాక నుంచి తన కుమారుడిని పోటీకి దించాలని సీతక్క భావించారు. సూర్య కూడా అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. టికెట్ వస్తే గెలిచి తీరుతాననే ధీమాతో ఉన్నారు. తన నియోజకవర్గంపై సీతక్క దృష్టిపెట్టడంతో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు ములుగులో సీతక్క కు చెక్‌ పెట్టే ప్రయత్నాలు మొదలెట్టారు. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న పొడెం వీరయ్యను బీఆర్ఎస్ లో చేర్చుకుని ఆయన్ను ములుగులో సీతక్క పైన పోటీకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగులో వీరయ్యకు పట్టు ఉంది. 1999, 2004 లో ములుగు నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వీరయ్య మాత్రం తాను కాంగ్రెస్ లోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు పినపాకలో ఇటు ములుగులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనుంది.