కొట్లాటల స్టేషన్ లో కడియం దూకుడు

By KTV Telugu On 3 April, 2023
image

 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం రెండు మూడేళ్లుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. నాటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేటి ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గం తనదంటే తనదని ఇద్దరు నేతలు తేల్చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా ఇద్దరు నేతలూ ఒక అడుగు కూడా వెనక్కి వేయడం లేదు.

ఈ సారి ఎన్నికల్లో తనకు లేదా తన కుటుంబ సభ్యులకు టికెట్ వస్తుందని ఆశిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు మళ్లీ దూడుకు పెంచారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు తన వ్యతిరేకులపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పరిధిలో జరిగే ఆత్మీయ సమావేశాలకు తనను ఎందుకు పిలవడం లేదని నిలదీస్తున్నారు. ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వకపోతే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని శ్రీహరి హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో తాను సాయం అందించి మరీ ఎమ్మెల్యే రాజయ్యను గెలిపించానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేశానని అంటూ ఇకనైనా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

కడియం శ్రీహరి వైఖరిలో కొంత ఆవేదన కూడా కనిపించింది. ఎన్నికల్లో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తే ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు. పార్టీలో అభిప్రాయబేధాలు వస్తే ఎవరు బాధ్యత వహించాలో నిర్ణయించుకోవాలన్నారు. ఘనపురం నియోజకవర్గాన్ని వదులుకునే ప్రసక్తే లేదని రాజయ్య ప్రకటించినప్పటి నుంచి కడియం కారాలు మిరియాలు నూరుతున్నారు. రాజయ్యపై వీలైనప్పుడల్లా ఆరోపణలు సంధిస్తున్నారు. దళిత బంధు పథకాన్ని రాజయ్య బంధువులకు మాత్రమే ఇస్తున్నారని మూడు నెలల క్రితం ఆయన ఆరోపణలు సంధించారు. కమీషన్లు ఇచ్చిన వారికే దళిత బంధు అందిస్తే సహించేది లేదన్నారు. దానితో రాజయ్య కూడా కౌంటర్ ఇచ్చారు. దళితబంధుపై కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వారిని సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని కూడా ప్రకటించేశారు. లబ్ధిదారులకు జరిగే ప్రయోజనం ఎమ్మెల్యే ద్వారానే అందాలన్నారు. గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు పితికితే రావంటూ శ్రీహరిపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.

ఇటీవల రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం జానకీపురం గ్రామ మహిళా సర్పంచ్ నవ్య ఆయనపై ఆరోపణలు చేశారు. అసలు బీఆర్ఎస్ లో అందరూ అంతే అనే స్థాయిలో ఆమె మాట్లాడారు. దానితో దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్టానం రాజయ్యకు తలంటింది. ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దానితో గత్యంతరం లేక రాజయ్య వారి ఊరికి వెళ్లారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు క్షమాపణ చెప్పడమే కాకుండా గ్రామాభివృద్ధికి 25 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. నవ్య ఆరోపణల వెనుక కడియం శ్రీహరి ఉన్నారని అనుమానించిన రాజయ్య అప్పటి నుంచి తెరవెనుక రాజకీయాలు మొదలు పెట్టారు. దానితో కడియానికి చురుకుముట్టి ఆరోపణలు మొదలు పెట్టారు.

డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయిన తర్వాత కడియం రాజకీయ నిరుద్యోగిగా మారారు. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వాలని లాబీయింగ్ మొదలు పెట్టారు. ఘన్ పూర్లో వేరే పార్టీలు బలంగా లేవని గ్రహించిన కడియం ఎలాగైనా బీఆర్ఎస్లో ఆ టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే సిట్టింగులకే టికెట్లు అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది. ఎలాగైనా రాజయ్యకు టికెట్ రాకుండా చేయగలిగితే తనకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు.