కేసీఆర్‌ కూతురికే ప్రలోభాలా! నమ్మబుద్ధిగా లేదే!

By KTV Telugu On 21 November, 2022
image

భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో బీజేపీ వెన్నులో వణుకుపుడుతోందని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. శాస్త్రీయంగా ఆధారాలన్నీ నిరూపణ అయితే బీజేపీ అగ్రనాయకత్వం బోనులో నిలబడక తప్పదంటోంది గులాబీపార్టీ. పైకే మేకపోతు గాంభీర్యం. లోపల బీజేపీతో యుద్ధం చివరికి అధికారానికి ఎసరు పెడుతుందేమోనన్న భయం టీఆర్‌ఎస్‌లో అంతర్లీనంగా ఉన్నట్లుంది. అధినేత మాటల్లో, హెచ్చరికల్లో ఆ బెరుకు పరోక్షంగా కనిపిస్తోంది. కీలక సమయంలో టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్‌. ఫాంహౌస్‌ ఆపరేషన్‌ తర్వాత నిర్వహించిన మీటింగ్‌ ఇది. ఈ మీటింగ్‌లో అందరికీ జాగ్రత్తలు చెబుతూనే గులాబీబాస్‌ హెచ్చరికలు కూడా చేశారు. వ్యాపారాలు చేస్తున్నవారు, ఏదన్నా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు కేసీఆర్‌. బీజేపీ ఎవరికన్నా లైన్‌లోకి వస్తే వెంటనే తన చెవిన వేయాలని పురమాయించారు. ఒకవేళ ఎవరన్నా రహస్యంగా ఉంచినా అది తనకు వెంటనే తెలిసిపోతుందని కేసీఆర్‌ బాంబుపేల్చారు. ఎలా తెలిసిపోతుందబ్బా! అంటే బీజేపీ అనుమానపడుతున్నట్లు ఫోన్‌ ట్యాపింగ్స్ జరుగుతున్నాయన్న మాటేగా! నిజంగానే అందరి ఫోన్లూ వినేస్తున్నారా…భయపెడితే ఎవరూ చేజారిపోకుండా ఉంటారని మైండ్‌గేమ్‌ ఆడుతున్నారా?

బేరసారాలకు వచ్చిన బీజేపీ దూతలుగా చెబుతున్నవాళ్లు ఫాంహౌస్‌లో కలిసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీ ఫిరాయించినవాళ్లే. వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచింది ఒక్క గువ్వల బాలరాజే. పోయిపోయి వాళ్లకి గేలం వేయడమే ఆశ్చర్యమైతే వారిద్వారా మిగిలినవాళ్లని ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగిందనేది సిట్‌ ఎంక్వైరీ చేస్తున్న కేసులో కీలకపాయింట్‌. వాకే.. ఈజీగా పడిపోతారని వాళ్లని కాంటాక్ట్‌ చేసి ఉండొచ్చు. నా కూతురిని కూడా ప్రలోభపెట్టారని కేసీఆర్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ బయటపెట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలే దీన్ని నమ్మలేకపోతున్నారు. జాతీయస్థాయిలో తమతో ఢీకొట్టాలనుకుని బీఆర్‌ఎస్ పెట్టిన కేసీఆర్‌ కూతురితో బేరసారాలు సాధ్యమేనా? కల్వకుంట్ల కుటుంబంలో అధికారికపోరాటమేం జరగడం లేదే! అలాంటిది కవితని పార్టీ మారాలని బీజేపీ ఒత్తిడితెచ్చే అవకాశం ఉందా? ఆ బేరసారాలు ఆడిందెవరో చెప్పాలంటోంది బీజేపీ. కానీ కేసీఆర్‌ చెప్పారంటే దానికి తగ్గ కథా స్క్రీన్‌ప్లే రెడీగా ఉండుంటుంది. ఇక మొన్నటిదాకా సిట్టింగ్‌లకు సెగ తప్పదనే సంకేతాలిస్తూ వచ్చారు. సర్వేలతో కొందరికి మొండిచేయి తప్పదని అంతర్గత లీకులిచ్చారు. ఇప్పుడేమో సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ సీట్లు అంటున్నారు. అంటే కేసీఆర్‌ బెదరగొడుతున్నట్లా? బెదిరిపోతున్నట్లా?