కాంగ్రెస్ అధిష్టానం రూటు మార్చింది. లోక్ సభ రూటులో పెద్దాయన

By KTV Telugu On 5 February, 2023
image

కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో అన్న అనుమానాలు ఉండేవి. 2014 ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ ఆయన ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే అక్కడ ఆయన మినహా మరో అభ్యర్థి లేకపోవడంతో 2018లోనూ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే ఆ వెంటనే వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జీవన్‌రెడ్డికి కలిసి వచ్చాయి. ఆ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానన్న ఆయన హామీకి ఓటర్లు ఘనవిజయం అందించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మూడు నాలుగు నెలలకే తిరిగి ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళీ ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెట్టారు.

జీవన్ రెడ్డి విషయంలో కొత్త చర్చకు తెరలేచింది. జగిత్యాల అసెంబ్లీకి ఆయన పోటీ చేయాలనుకున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన్ను పార్లమెంట్‌ ఎన్నికలకు పంపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డి కోరుకుంటే నిజామాబాద్ ఎంపీ సీటు ఆయనకే ఇస్తుందనే టాక్‌ నడుస్తోంది. జగిత్యాల కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పటికే ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ రైతులకు జీవన్‌రెడ్డి సుపరిచితులు. పైగా ఎన్నోసార్లు రైతు పోరాటాలు చేసి ఉండడంతో నిజామాబాద్ పార్లమెంట్‌ స్థానంలో జీవన్‌రెడ్డికి అనుకూల ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. అయితే జీవన్‌రెడ్డి మాత్రం జగిత్యాల అసెంబ్లీ సీటును వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. మొదటి ప్రాధాన్యత అసెంబ్లీకే అంటూ ఇటీవల ప్రకటించారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీకే పోటీ చేస్తానని కూడా చెప్పారు.

వాస్తవానికి ఎమ్మెల్సీ పదవిలో జీవన్‌రెడ్డి ఇంకో రెండేళ్లు కొనసాగుతారు. అయినా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షతో ఉన్నారు. పైగా జగిత్యాలలో ఆయన కంటే మంచి అభ్యర్థి ఇప్పుడు కనిపించడం లేదు. జీవన్ రెడ్డి పోటి చేస్తేనే బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఏజ్ ఫ్యాక్టర్ తో జీవన్ రెడ్డికి విశ్రాంతి ఇవ్వాలని పార్టీ అనుకున్నా ఆయన కుటుంబం నుంచి బరిలోకి దిగేందుకు వేరే ఎవ్వరూ సిద్ధంగా లేరు. దానితో ఇప్పుడు జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

జీవన్ రెడ్డి తన ప్రిఫరెన్స్ జగిత్యాల అసెంబ్లీయేనని చెబుతున్నారు. అదే సమయంలో అధిష్టానం ఆదేశిస్తే లోక్ సభకు బరిలోకి దిగుతానని అంటున్నారు. జీవన్ రెడ్డిని పోటీ చేయించాలనుకునేందుకు ఒక ప్రధాన కారణం కూడా ఉంది. అధికార బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ తనయ కవిత మళ్లీ బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ప్రస్తుత బీజెపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ సారి పోటీ చేయకపోవచ్చంటున్నారు. కవితకు గట్టి పోటీ ఇచ్చి గెలిచే సత్తా జీవన్ రెడ్డికి మాత్రమే ఉందన్న చర్చ నిజామాబాద్ ఏరియాలో ఊపందుకుంది. గత ఎన్నికల్లో కవిత ఓటమి వెనుక పరోక్షంగా జీవన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేవారు. ఈ సారి కాంగ్రెస్ డైరెక్ట్ గేమ్ ఆడబోతోంది.