ఈడీ పిలిస్తే ఏం చేయాలి ?

By KTV Telugu On 2 December, 2022
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరుపై కలకలం
టీఆర్‌ఎస్‌ పెద్దల మల్లగుల్లాలు

అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దర్యాప్తు సంస్థల పోటాపోటి దాడులు, సోదాలు, నోటీసుల ఆటలో టీఆర్ఎస్‌, బీజేపీ నాయకులు పావులుగా మారిపోయారు. ఎప్పుడు ఎవరి ఇంట్లో సోదాలు జరుగుతాయో, ఎవరికి నోటీసులు వస్తాయో అని రెండు పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ కుంభకోణం బయటకొచ్చిన మొదట్లో కూడా అందులో కవిత పేరు కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా డిల్లీ సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్టులో కవిత ప్రస్తావన గురించి ఈడీ చాలా స్పష్టంగా పేర్కొంది.

సౌత్‌ గ్రూపును నియంత్రిస్తున్న ముగ్గురిలో కవిత కూడా ఒకరు అని ఆ రిపోర్టులో ఈడీ వ్యాఖ్యానించింది. ఈ స్కామ్‌లో మొత్తం 36 మందికి సంబంధం ఉందని స్పష్టం చేసింది. వారందరూ ఏడాది కాలంలో సుమారు 170 మొబైల్‌ ఫోన్లను, సిమ్‌ కార్డులను మార్చారని డిజిటల్ ఎవిడెన్సులు దొరకకుండా ధ్వసం చేశారని రిమాండ్‌ డైరీ రిపోర్టులో ఈడీ పేర్కొంది. కవిత కూడా పది ఫోన్లను మార్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ ఫోన్లను ఎందుకు ధ్వసం చేశారనే విషయంపై ఈడీ కూపీ లాగబోతోంది. కొన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. ఫోన్లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడంపై ఈడీ దృష్టి సారించింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆరోరా నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఈడీ తదుపరి చర్యలకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఈ కేసు వ్యవహారంలో ఇక ముందు ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

రిమాండ్‌ రిపోర్టులో కవిత పేరు ఉన్నందున ఈడీ అధికారులు ఆమెకు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తారా ? అరెస్టు చేస్తారా…? కవిత జైలుకు వెళ్లక తప్పదా అని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో చర్చ మొదలైంది. విచారణకు పిలిస్తే ఏం చేయాలని న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. మనీ లాండరింగ్‌ అంశం ఇమిడి ఉన్నందున ఈ లిక్కర్ స్కామ్‌ను ఈడీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే కవితకు ఆడిటర్‌గా ఉన్న బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. కవితకు చెందిన పలు కంపెనీలకు ఆయన ఆయన చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆ కంపెనీల లావాదేవీలు, ఆదాయం, ఐటీ రిటర్న్స్‌, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు, విరాళాలు, ఖర్చులు తదితర అంశాలన్నింటిపైనా ఈడీ ఫోకస్‌ పెట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే కవితకు చిక్కులు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా ఊహించినందునే ఈడీ మోడీలకు భయపడేది లేదు. అరెస్టు చేస్తే చేసుకోండి.  తాను జైలుకెళ్లడానికైనా సిద్ధం అని కవిత ఛాలెంజ్‌ చేశారు. వారం రోజులు గడిస్తే కానీ ఈడీ దర్యాప్తుపై పూర్తి క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.