కవిత ఇంటికి రాబోతున్న సీబీఐ

By KTV Telugu On 6 December, 2022
image

ఈనెల 11న కవితను విచారించనున్న సీబీఐ
కవిత కు సీబీఐ నుంచి ఈమెయిల్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించేది ఎప్పుడు అనే అంశంపై మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌ తొలగిపోయింది. ఈనెల 11న విచారణకు సిద్ధంగా ఉండాలని సీబీఐ నుంచి కవితకు సమాచారం అందింది. ఆమెను ఇంట్లోనే విచారించనున్నారు. మొదట్లో ఈ నెల 6వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని కవితకు నోటీసు పంపించారు సీబీఐ అధికారులు. తన ఇంట్లోనే విచారణకు హాజరవుతానని క‌విత కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయిన తరువాత ఆమె మ‌న‌సు మార్చుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌, కంప్లయింట్‌ కాపీలు తనకు పంపించాలని సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్‌లో కానీ, కంప్లయింట్లో కానీ తన పేరు లేదని అన్నారు కవిత. సోమవారం సీబీఐకి కవిత మరో లేఖ రాశారు.విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.

అయితే ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున 6వ తేదీన విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు అందుబాటులో ఉంటానని, ఈ తేదీల్లో ఏదో ఒక తేదీని ఖరారు చేయండి అని పేర్కొన్నారు. అయితే ఆ లేఖపై సీబీఐ వెంటనే స్పందించలేదు. దాంతో ముందుగా చెప్పిన విధంగా 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. చివరకు సాయత్రం సీబీఐ నుంచి కవితకు సమాచారం అందింది. ఆమె ఇచ్చిన నాలుగు తేదీల్లో 11వ తేదీన విచారణకు అందుబాటులో ఉండాలని మెయిల్‌ చేసింది. కవితను విచారించిన తరువాత సీబీఐ ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.