కొంచెం కొంచెంగా కవితాత్మకంగా.

By KTV Telugu On 12 December, 2022
image

సీబీఐ ఒక అడుగు ముందుకేసిందా ? కవితను ప్రశ్నించి తమకు అవసరమైన సమాచారం రాబట్టిందా ? కేసీఆర్ తనయను ఫిక్స్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? మరో సారి ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించుకోవడంతో కథ ఇంకా ముగిసిపోలేదనుకోవాలా ?

లిక్కర్ స్కాంలో బిగుస్తున్న ఉచ్చు
కవిత వివరణ తీసుకున్న సీబీఐ
ఆమె నివాసంలోనే ఏడున్నర గంటల పాటు విచారణ
సెల్ ఫోన్ల ధ్వంసంపై ప్రశ్నించినట్లు సమాచారం
బ్యాంకు లావాదేవీలే కీలకం
అనుకున్న సమాచారం రాబట్టిన సీబీఐ ?
160 సీఆర్పీసీ కింద విచారణ
91 సీఆర్పీసీ కింద తాజా నోటీసులు
త్వరలో విచారణకు పిలిచే అవకాశం
మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తే ఈడీ ఎంట్రీ

ఎవరైతే మాకేంటీ ఇదీ సీబీఐ విధానం. కేసు చేతికి వస్తే తమదైన శైలిలో ప్రశ్నించడం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆనవాయితీ. సీబీఐ కార్యాలయానికి పిలిపించుకుని గంటల కొద్దీ కూర్బోబెట్టడం వారికి నిత్యం అలవాటే. మళ్లీ రేపురా, ఎల్లుండి రా అని పంపించెయ్యడం కూడా నిత్యం జరిగేదే. కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం సీబీఐ రూటు మార్చింది. చాలా పకడ్బందీగా ఆమెకు కేసులో ఇరికించే ప్లాన్ అమలు చేస్తోందని సీబీఐ దర్యాప్తు తీరు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ఆమెను నేరుగా నిందితురాలిగా చేర్చకుండా అనుమానితురాలిగానే ఉంచారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. వంద కోట్లు చేతులు మారినట్లు, ఆ సంగతి బయట పడకుండా సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు ఆధారంగానే కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ వచ్చింది. ముందే ఢిల్లీ పిలిపించకుండా రూట్ మార్చి అధికారులే స్వయంగా హైదరాబాద్ వచ్చారు. అన్ని ప్రోటాకాల్స్ పాటిస్తూ కవిత సూచించిన టైమ్ కే రావడంతో ఆరోపణలకు అవకాశం లేకుండా పోయింది. ఏడున్నర గంటల విచారణ తర్వాత. ఆమె నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. భవిష్యత్తులో ఇంకా ప్రశ్నించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇప్పుడు మాత్రం కీలక సమాచారం తీసుకున్నట్లుగా కూడా అనుకోవాల్సి వస్తుంది.

సెల్ ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అనివార్యతపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు విశ్వసనీయ సమాచారం. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, ముత్తా గౌతమ్, సూదిని సృజన్ రెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాతో లిక్కర్ పాలసీపై చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయా అని కూడా కవితను అధికారులు ప్రశ్నించారన్నది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. కవిత దగ్గర తీసుకున్న వివరణతో పాటు భవిష్యత్తు విచారణకు బ్యాంక్ ఖాతాలే కీలకం కానున్నాయి. కొన్ని అనుమానిత నగదు బదిలీలపైనే సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. అమిత్ అరోరా, విజయ్ నాయర్ కు చేరిన డబ్బులు, వారి ఖాతాల నుంచి ఇతరులకు బదిలీ అయిన తీరు కవిత, సిసోడియాపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఎవరి నుంచి ఎవరికి ఎంత సొమ్ము చేరిందీ, మధ్యవర్తులెవ్వరూ అన్న ప్రశ్నలు సీబీఐకే అంతు చిక్కడం లేదని దాన్ని డీకోడ్ చేసే పని వేగవంతమైందని చెబుతున్నారు. ఆ పని జరిగిన తర్వాత కవిత, సిసోడియాను మరోసారి ప్రశ్నించే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికే ఢిల్లీలో సిసోడియాను ఒకటి రెండు సార్లు ప్రశ్నించారు.

సీబీఐ అధికారులు వెళ్లిపోయిన తర్వాత కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ కు పూర్తి వివరాలు అందించారు. విచారణకు సహకరిస్తామని ఆమె ఎప్పుడో ప్రకటించారు. ఏమీ జరగనట్లు ఏదో అడిగిన సమాచారం ఇచ్చి పంపినట్లు టీఆర్ఎస్ వర్గాలు కలరింగ్ ఇచ్చినప్పటికీ లోలోన టెన్షన్ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పై మోదీ పగబట్టిన నేపథ్యంలో రేపు ఎటు వైపు నుంచి ఉపద్రవం వచ్చిపడుతుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. అయితే భయపడేది లేదని మాత్రం చెబుతున్నారు, ఏదైనా జరగడం ఖాయం. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కుటుంబం డిసైడైందని సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం 160 సీఆర్పీసీ ద్వారా సీబీఐ కవితను ప్రశ్నించింది. సాక్షులుగా మహిళలను ప్రశ్నించాల్సిన తరుణంలో దర్యాప్తు సంస్థలు ఇలానే విచారిస్తాయి. ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాయి.161 సీఆర్పీసీ కింద ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేశారు. స్టేట్ మెంట్ పై రెవెన్యూ అధికారుల సంతకం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే కథ ఇంతటితో ముగిసిపోలేదు. 91 సీఆర్పీసీ కింద సీబీఐ మరో విడత నోటిసులు పంపింది. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లేదా డిజిటల్ డివైజ్ ను సీబీఐకి ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయంలో డాక్యుమెంట్ లేదా డివైజ్ లు సీబీఐ కి ఇవ్వాలని తెలిపారు. త్వరలో విచారణ జరగనుండగా ఎక్కడ హాజరు కావాలి అనే వివరాలు త్వరలో మెయిల్ చేస్తామన్నారు. నోటీసులు అందుకున్న వాళ్లు మాత్రమే హాజరు కావాలని తాము చెప్పిన చోటుకు వచ్చి విచారణకు హాజరు కావాలని సీబీఐ కవితకు సూచించింది.

సిబీఐ విచారణ మరింత దూరం వెళితే మాత్రం కవిత విషయంలో ఈడీ కూడా రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ ద్వారా పొందిన లంచం డబ్బులను వేరే పనులకు మళ్లించిన పక్షంలో అదీ మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. డబ్బును ఎక్కడికి ఎలా తరలించారని విచారించే అవకాశం ఉంటుంది. రెండు వైపులా నుంచి ఇబ్బందులు తప్పవు